బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు డ్రగ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్ వ్యాపారవేత్తలు సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తెలుగు మీడియాలో వార్తలు రావడం సంచలనం కలిగిస్తోంది. బెంగళూరులోని పబ్ లు, హోటళ్లు నిర్వహించే ప్రముఖులకు సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి పార్టీలు ఇచ్చేవారని తెలుస్తోంది. 

మీడియా కథనాల ప్రకారం.... తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు ఆ పార్టీల్లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. దాంతో పాటు కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్ తో కలిసి సందీప్, కలహర్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవారని సమాచారం.

ఇటీవల డ్రగ్ కేసులో పట్టుబడిన నైజీరియన్ ను బెంగళూరు పోలీసులు విచారించారు. ఈ విచారణలో అతను పలు విషయాలు వెల్లడించాడు సందీప్ రెడ్డికి, కలహర్ రెడ్డికి, శంకర్ గౌడ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అతను అంగీకరించినట్లు తెలుస్తోంది. దాంతో ముగ్గురికి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వారిలో కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ తప్పించుకుని తిరుగుతున్నారు. సందీప్ రెడ్డిని మాత్రం ఇప్పటికే పోలీసులు విచారించారు సందీప్ రెడ్డిని విచారించగా పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. కలహర్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు పార్టీలు ఇచ్చేవారని, ఈ పార్టీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు సందీప్ రెడ్డి వెల్లడించినట్లు చెబుతున్నారు నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నట్లు అతను చెప్పాడని అంటున్నారు. 

ఎమ్మెల్యేలను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సందీప్ రెడ్డిని పోలీసులు ఇటీవల విచారించారని, ఆ విచారణ నివేదికను తాము సేకరించామని ఈనాడు దినపత్రిక చెప్పుకుంది.  ఓ తెలంగాణ ఉద్యమకారుడి ప్రమేయం కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు శివారుల్లో జరిగిన పార్టీలకు అతనే కొకైన్ తెచ్చాడని, ఆ పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొన్నారని తెలుస్తోంది. 

తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తికి క్యాబ్ ల వ్యాపారం కూడా ఉందని ఈనాడు దినపత్రిక రాసింది. కలహర్ రెడ్డితో కలిసి సినిమాలకు ఫైనాన్స్ కూడా చేసేవాడని అంటున్నారు. తన క్యాబ్ ల ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాదుకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు, ప్రతి నెలా బెంగళూరులో పార్టీ ఏర్పాటు చేసి హైదరాబాదు నుంచి ప్రముఖులను తీసుకుని వెళ్లేవాడని కూడా రాసింది.