హైదరాబాద్‌ : స్నేహం చేయమని ప్రాధేయపడ్డాడు. నీతో ఫ్రెండ్ షిప్ చేయను అనేసరికి చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపులకు భయపడ్డ ఆ యువతి వాడితో స్నేహం చేసింది. స్నేహంగా ఉంటున్న సమయంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసుకున్నాడు. 

సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి ఆ యువతిని బెదిరించేవాడు. పోకిరీ బెదిరింపులకు యువతి భయపడటంతో ఆ దుర్మార్గుడి చేష్టలు తారా స్థాయికి చేరాయి. న్యూడ్ ఫోటోలు పంపించాలని లేకపోతే ఫోటోలు మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. 

దాంతో తప్పని పరిస్థితుల్లో ఓసారి న్యూడ్ ఫోటోస్ పంపించింది. వాటిని ఆసరాగా చేసుకుని ఆ యువకుడు ఆమెను నిత్యం వేధించడం మెుదలుపెట్టాడు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. 

స్నేహం అనే పదానికి మాయని మచ్చ తెచ్చిపెట్టిన ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ సనత్ నగర్ కు చెందిన మహ్మద్ రయనుద్దీన్ శంకర్ పల్లిలోని ఓ విద్యాసంస్థలో బీబీఏ కోర్సు చదువుతూ హాస్టల్ లో ఉంటున్నాడు. 

సరూర్ నగర్ కు చెందిన ఓ యువతితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆ యువతి అంగీకరించకపోవడంతో చంపేస్తానని బెదిరించడంతో ఆమె స్నేహం చేయడం మెుదలు పెట్టింది. స్నేహితుడేగా అని ఆ యువతి రయనుద్దీన్ తో చనువుగా ప్రవర్తించింది. 

ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను రయనుద్దీన్ రహస్యంగా చిత్రీకరించాడు. వాటిని అడ్డుపెట్టుకుని సదరు యువతిని బెదిరించడం మెుదలుపెట్టాడు. కుటుం సభ్యులతో సినిమాకు వెళ్లిన యువతికి రయనుద్దీన్ ఫోన్ చేశాడు. వాష్ రూమ్ లోకి వెళ్లి స్వయంగా న్యూడ్ వీడియో తీసుకుని పంపించాలని బెదిరించాడు. 

లేకపోతే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో అతడి కోరిక నెరవేర్చింది. ఆ నీలి చిత్రాలు చేతికి చిక్కినప్పటి నుంచి యువతిని మరింత వేధించడం మెుదలుపెట్టాడు నిందితుడు రయనుద్దీన్.

రయనుద్దీన్ వేధింపులు తీవ్రమవ్వడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.