రోజు రోజుకీ సమాజంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలకు కనీస రక్షణ కూడా ఉండటం లేదు. తాజాగా ఓ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక(17) ఆగస్టు 25న కొత్తపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. సాయంత్రమైనా అక్కడికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మరుసటి రోజు ఉదయం ఆ బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆగస్టు 25న అమ్మమ్మ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఎల్‌బీనగర్‌ శివమ్మనగర్‌లో ఉంటున్న ఆటో డ్రైవర్‌ ఆంబోతు రమేశ్‌, భరత్‌నగర్‌లో ఉంటున్న గాల పవన్‌ గమనించారు. రింగ్‌ రోడ్డు వద్ద ఆ బాలికను ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని హయత్‌నగర్‌ కుంట్లూరులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి మరో ఆటోడ్రైవర్‌ రమావత్‌ సంతోష్ ను పిలిపించి.. ముగ్గురూ కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం విజయపురి కాలనీలో వదిలేశారు. బాలిక జరిగినదంతా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.