అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహశీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ రికార్డును కోరాయి.

ఇందుకు కారణం లేకపోలేదు. ఒక భూపట్టా విషయంలో రూ.2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ.1.10 కోట్లు స్వీకరిస్తూ ఇటీవలే తహశీల్దార్ పట్టుబడిన విషయం తెలిసిందే.

ఒక ప్రభుత్వ ఉద్యోగి 20 మిలియన్లను లంచం రూపంలో తీసుకుంటూ పట్టుబడటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయి వుండొచ్చని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైసీపీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యకలాపాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులో తెలిపారు.

దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన తమ వద్ద ఇంత వరకు ఎలాంటి కేటగిరీ లేదని, దీని కోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

కోటీ 25 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన కీసర ఎమ్మార్వో నాగరాజు సంపాదించిన ఆస్తుల విలువ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. 28 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని అక్రమంగా ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కోటీ 25 లక్షల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేయగా 28 లక్షల రూపాయల నగదు, 2 కిలోల బంగారు నగలు లభించాయి. మరో రెండు లాకర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నాగరాజు ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాదు శివారులో నాగరాజు పెద్ద యెత్తున భూముల క్రియవిక్రయాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

తవ్వుతున్న కొద్దీ నాగరాజు అక్రమాలు బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కరొక్కరే బయటకు వస్తున్నారు. పోలీసు అధికారి అయిన తనను కూడా నాగరాజు లంచం అడిగాడని, తన పరిస్థితి ఏలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని సురేందర్ రెడ్డి అన్నారు.

డబ్బులు ఇవ్వకుండా నాగరాజు ఒక్క పని కూడా చేయడని ఆయన అన్నారు. గతంలో తాను సిఎస్, రెవెన్యు ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. అధికారులను మభ్యపెడుతూ నాగరాజు పదవిని కాపాడుకున్నాడని ఆయన అన్నారు. ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అన్నారు.