హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ లో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు తప్పతాగి అత్యాచారం చేశారనే ఘటన మరో మలుపు తిరిగింది. తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ బాలిక 100కు డయల్ చేసి పోలీసులకు చెప్పింది. దాంతో పోలీసులు హుటాహుటిన అమీనాపూర్ లోని నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకున్నారు. 

బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలో నిజం లేదని, బాలిక కట్టుకథను సృష్టించిందని సంగారెడ్డి పోలీసులు తెలిపారు. 

Also Read: సంగారెడ్డి జిల్లాలో దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్, ప్రాణాలు కాపాడిన డయల్ 100

బాలికపై అత్యాచారం జరగలేదని, అత్యాచారం జరిగినట్లు బాలిక చెప్పిన విషయం నిజం కాదని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. బాలిక బాయ్ ఫ్రెండ్ తో అక్కడికి వెళ్లి తనపై అత్యాచారం జరిగిందని డ్రామా ఆడినట్లు ఆయన తెలిపారు. 

గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలిక 100కు డయల్ చేసి తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని చెప్పింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను కనిపెట్టారు. 

కుటుంబ సభ్యుల సమక్షంలో బాలికను విచారించామని, డబ్బుల చోరీపై వివాదం జరగడంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో తమ కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని బాలిక తండ్రి చెప్పిందని ఆయన వివరించారు.