హైదరాబాద్: మహిళలను ఉద్ధరిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ర్యాలీలు తీయదడం విచిత్రంగా ఉందని నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజీనీ దేవి అన్నారు. చంద్రబాబు 2002లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు తన బిడ్డను రేప్ చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. 

న్యాయం కోసం తాము పోరాటం చేస్తే అధికార బలంతో ఏ ఒక్క ఆధారం కూడా లేకుండా చేశారని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు. అయినప్పటికీ సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాచేపల్లి, రిషితేష్వరి ఘటనలను, విజయవాడలో కాల్ మనీ గ్యాంగులను, మహిళల అరాచకాలతర్ావత చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ర్యాలీసు చూసి కడుపు మండి మీడియాతో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. 

చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమేనని అన్నారు. తన బిడ్డను రేప్ చేసి, హత్య చేశారని అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబును కలిసి ఆధారాలు ఇచ్చామని, వాటన్నింటినీ తారుమారు చేశారని ఆమె అన్నారు. 

అప్పటి ప్రత్యూష హత్య కేసును తిరిగి విచారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. సుప్రీంకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.