ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం గుంటూరులో చోటుచేసుకుంది. అయితే బాధితురాలితో ఎంతో నమ్మకంగా ఉండే మరో యువతే ఈ నిందితులకు సహకరించింది. ఇలా ఆరు నెలల క్రితం జరిగిన ఘటన తాజాగా బాధిత యువతి బైటపెట్టడంతో వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగాన్వేషణ కోసం ఓ 23ఏళ్ల యువతి హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంటర్వ్యూలకు వెలుతుండేది. ఈ క్రమంలో ఈమెకు శిరీష అనే యువతి పరిచయమైంది. తక్కువ కాలంలోనే వీరిద్దరు మంచి స్నేహితులయ్యారు.

అయితే శిరీష బాధితురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గుంటూరుకు తీసుకెళ్లింది. శిరీష పై నమ్మకంతో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా బాధితురాలు ఆమెతో వెళ్లింది. అయితే అక్కడ బాధితురాలిని ఓ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లిన శిరీష మత్తు మందు కలిపిన శీతల పానియాన్ని తాగడానికి ఇచ్చింది. ఇది తాగగానే బాధితురాలు స్పృహతప్పి పడిపోయింది. ఇలా అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై నలుగురు గుర్తు తెలియని యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

స్పృహలోకి వచ్చిన యువతి తనపై అఘాయిత్యం జరిగిందని గుర్తించింది. అయితే పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. అయితే తాజాగా బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బైటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.