సిద్ధిపేట: మిత్రుడే నమ్మించి ఇతరులతో కలిసి 16 ఏళ్ల వయస్సు గల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను వదిలిపెట్టాలని బాలిక కాళ్లు మొక్కినా వాళ్ల మనసు కరలగేదు. దాదాపు 12 గంటల పాటు ముగ్గురు యువకులు బాలికపై రాత్రంతా వంతులవారీగా అత్యాచారం చేస్తూ వెళ్లారు. 

మిత్రుడు బాలికను నమ్మించి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులతో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం దాకా వంతులవారీగా ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. బాధకు తట్టుకోలేక ఆమె కేకలు వేస్తున్నా పట్టించుకోలేదు. 

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం రాయవరం గ్రామంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలికను ఆమెకు పరిచయం ఉన్న ఓ యువకుడు బుధవారం సాయంత్రం మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకుని వెళ్లాడు.
 
రాజీవ్‌ రహదారి సమీపానికి వెళ్లిన తర్వాత తన మిత్రులకు ఫోన్‌ చేసి అక్కడికి రమ్మన్నాడు. అక్కడ ఆమెను ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి తెల్లవార్లూ నరకం చూపారు. గురువారం ఉదయం తీవ్ర గాయాలతో నిలబడలేని స్థితిలో ఉన్న ఆమెను రాజీవ్‌ రహదారి మీద పడేసి పారిపోయారు. 

 రోడ్డుపై పడివున్న స్థితిలో ఆమెను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆరా తీయగా తన పట్ల జరిగిన దారుణాన్ని చెప్పింది. ఘటనపై జగదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు.