న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం బాగా పెరగడంతో ఫోన్‌ల తయారీ కంపెనీలు రకరకాల ఫీచర్లతో కొత్త బ్రాండ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రమే పోటీకి తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. మరికొన్ని కంపెనీలు పోటీకి నిలబడలేక కనుమరుగై పోతున్నాయి. ప్రత్యేకించి జియోమీ బ్రాండ్ భారత్ మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2018లో 60 శాతం గ్రోథ్ నమోదు చేసింది. 

2018లో భారతదేశం నుంచి 41 స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు ఆదరణ లేక మార్కెట్‌లో లేకుండా పోయాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మరికొన్ని కంపెనీలు కొత్తబ్రాండ్‌లతో దేశంలోకి రంగప్రవేశం చేశాయి. 2018లో 15 కొత్తబ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. 2019లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా. 

ప్రధాన బ్రాండ్‌లకు చెందిన జియోమీ, శామ్‌సంగ్‌, వివో, అప్పో పోటీని తట్టుకుని నిలబడగలిగాయి. 2014-15లో 300 రకాల  బ్రాండ్‌లు దేశంలోని స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఉండగా ప్రస్తుతం ఇవి 200బ్రాండ్‌లకు తగ్గాయి. ప్రపంచ మార్కెట్‌తో పోల్చి చూసుకుంటే 2018లో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ 10 శాతం వృద్ధి  చెందింది. 2019లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది. 

చైనా కొత్తబ్రాండ్‌ రియల్‌ మీ 2018లో భారత మార్కెట్‌లోకి అడుగిడి బాగా నిలదొక్కుకుంది. కొత్త బ్రాండ్‌లకు దేశమార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుందని రియల్‌మి నిరూపించింది. చైనా బ్రాండ్లైన జియోమీ, వివో, అప్పో దేశీయ మార్కెట్‌లో 2018లో 46 శాతం వాటా దక్కించుకున్నాయి. 

మరోవైపు స్వదేశీ బ్రాండ్లయిన మైక్రోమ్యాక్స్‌, లావా, ఇంటెక్స్‌, కార్బన్‌ సంయుక్తంగా 8శాతం మార్కెట్‌ వాటా మాత్రమే పొందగలిగాయి. విదేశీ బ్రాండ్లలో జియోమీ తర్వాత శామ్ సంగ్ 20.4, వివో 14.3 శాతం, అప్పో 5.2 శాతం పురోగతి నమోదు చేశాయి. 2019లోనూ ఇండియన్లు ఆన్‌లైన్‌లోనే మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తారని అంచనా వేస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో జియోమీ, వన్ ప్లస్, హువావే పరస్పరం పోటీ పడుతుంటాయి. 

అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2018లో తగ్గుముఖం పట్టినా ఇండియాలో 12 మిలియన్లకు పైగా పెరిగి 137 మిలియన్లకు చేరుకున్నాయి. ప్రపంచ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లలో భారత్ వాటా 10 శాతానికి పైగానే ఉంటుంది. ఏడాది పొడవునా జరిగిన స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లలో టాప్ 20 దేశాల్లో భారత్ ఆరవ ర్యాంకులో ఉన్నది. 

ఇండోనేషియాలో అత్యధికంగా 17.1 శాతం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జరిగితే తర్వాత రష్యాలో 14.1, ఇటలీలో 10 శాతం సేల్స్ పెరిగాయి. ఈ నాలుగు దేశాలతో పోలిస్తే గత మూడేళ్లుగా భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లలో పురోగతి నమోదవుతూనే వస్తున్నదని సర్వేలు చెబుతున్నాయి.