చైనా బ్రాండ్ ఒప్పో అనుబంధ రియల్‌మీ సంస్థ తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్‌ మీ 2తో పోలిస్తే, అటు డిజైన్‌ పరంగా అభివ్రుద్ధి చేసిన రియల్ మీ 3 స్మార్ట్ ఫోన్‌లో ఫ్రంట్‌ కెమెరాను అప్‌గ్రేడ్‌ చేసింది. 

ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్‌ సేల్‌ ప్రారంభం కానుంది. మొదటి 10 లక్షల మంది కొనుగోలుదారులకు మాత్రమే 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ఫోన్ ధర రూ.8,999కు లభిస్తుందని రియల్‌మీ తెలిపింది. ఇక ప్రారంభ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే, రూ.500 అదనంగా రాయితీ లభిస్తుంది. రియల్ మీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ లోనూ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. తక్కువ లాభాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్ విక్రయానికి నిరాకరించింది. 

దీంతోపాటు జియోతో రూ.5,300 అదనపు లబ్ధిని పొందవచ్చు. మొబిక్విక్‌ ద్వారా చెల్లింపు చేస్తే 20% సూపర్‌ క్యాష్‌ రూపంలో పొందవచ్చు. రియల్‌మీ 3 ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం కానున్నది. బేసిక్‌ వేరియంట్‌ 3 జీబీ ర్యామ్‌తోపాటు 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ ధర రూ.8,999, 4జీబీ ర్యామ్‌‌తోపాటు 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మరో ఫోన్‌ ధరను రూ.10,999 నిర్ణయించారు. 

3డీ గ్రేడియంట్‌ యూని బాడీ డిజైన్‌, వాటర్ ‌డ్రాప్‌ నాచ్‌, హీలియో పీ70 ప్రాసెసర్‌, 4,230 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ప్రత్యేకతలతో దీన్ని విడుదల చేసింది. బ్లాక్‌, డైనమిక్‌ బ్లాక్‌, రేడియంట్‌ బ్లూ రంగుల్లో ఇది లభ్యం కానున్నది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు భారీ రాయితీ ఇవ్వలేమని రియల్‌మీ తెలిపింది. ఆఫ్‌లైన్‌ అమ్మకాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపొచ్చని పేర్కొంది.

‘వినియోగదారులకు మేలు చేసేలా వ్యవహరించే భాగస్వాముల కోసం మేము చూస్తున్నాం. వారికి భారీ మార్జిన్‌ అయితే ఇవ్వలేం. అందుకే మా మాదిరిగాగా ఆలోచించే వారినే మేము ఎంపిక చేసుకుంటాం. దీని వల్ల మా వ్యాపార విస్తరణ నెమ్మదించవచ్చు. కానీ, నెమ్మదిగా బలపడతాం’ అని రియల్‌ మీ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మహదేవ్‌ సేథ్‌ తెలిపారు. ఏడాదిలోనే భారతదేశంలోని 35 నగరాల్లో 3000కి పైగా రిటైల్‌ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చేనెలలో రియల్ మీ 3 ‘ప్రో’ మోడల్ ఫోన్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. 

రియల్ మీ 3 ఫోన్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌‌తోపాటు 6.2హెచ్‌డీ ఫుల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇంకా  2.1 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ70 ప్రాసెసర్‌ను అమర్చారు. విత్ 3జీబీ  32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4 జీబీ ప్లస్ 64 జీబీ ర్యామ్‌ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనున్నది. 13 ప్లస్ మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా గల రియల్ మీ 3 ఫోన్‌లో 4,230 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది.