బీజింగ్: అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం హువావేకు సంకటం తెచ్చి పెట్టింది. చైనా కంపెనీ అయిన హువావేపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన నిషేధం తీవ్ర ప్రభావం చూపనుందా? పరిస్థితులు అవుననే అంటున్నాయి. 

తాత్కాలికంగా 90 రోజులు సడలించినా..
తాత్కాలికంగా అమెరికా 90 రోజులు నిషేధం సడలించినా.. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సహా ఇతర సేవలను ఇవ్వబోమని గూగుల్‌ ప్రకటించిన నేపథ్యంలో హువావే స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై ప్రభావం ఎలా ఉంటుంది? అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

చైనా మినహా ఇంటర్నెట్ అంటే ‘గూగుల్’
అసలు నిజమేమిటంటే చైనా ఇవతల ఇంటర్నెట్ అంటేనే ‘గూగుల్‌’.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్న ఆండ్రాయిడ్ సేవలపై ఆంక్షలు విధిస్తే.. హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్లతో సమానమేనని పలు నివేదికలు అంటున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుగా హువావే టాప్‌ లిస్ట్‌లో ఉంది. 

గూగుల్ కాదంటే కస్టమర్ల అనాసక్తి
ఈ నేపథ్యంలో హువావే ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాం లేకుండా మొబైల్‌ ఫోన్లు తయారు చేస్తే, వినియోగదారులు ఆసక్తి చూపకపోవచ్చని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్‌ మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. ఇదే అదనుగా శామ్‌సంగ్‌ మరో అడుగు ముందుకు వేసే అవకాశాలు పుష్కలమని పేర్కొంది. 

గూగుల్ ఆంక్షలు శామ్ సంగ్ కు బెనిఫిట్
హువేవాకు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్‌తోపాటు దేశీయ షియోమీ, ఒప్పోల నుంచి గట్టి పోటీ ఉంది. హువావేపై గూగుల్‌ నిషేధం విధించడం ఆయా కంపెనీలకు లాభించనుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ విపణిలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో హువావేకు గూగుల్‌ సేవలు నిలిపివేయడం ఆ సంస్థకు శరాఘాతమే. 

వినూత్న ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రతి మొబైల్‌ కంపెనీలు వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఫుల్‌స్క్రీన్‌ డిస్‌ప్లేలు, పాప్‌అప్‌ కెమెరాలు, ఫ్లిప్‌ కెమెరాలతో సహా అత్యంత వేగంగా పనిచేసే చిప్‌సెట్‌లతో కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. 

ఏ ఫీచరైనా గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్‌లోనే వర్క్
ఎన్ని ఫీచర్లు జోడించినా, అవన్నీ గూగుల్‌ అందించే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌పైనే పని చేస్తాయి. పూర్తి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ లేకుండా(యాపిల్‌ కాదు) తీసుకొచ్చిన ఫోన్లు అంతగా విజయం సాధించలేదన్నది జగమెరిగిన సత్యం.

మెయిల్, యూ ట్యూబ్, మ్యాప్స్ తదితరాలు కావాలంటే గూగుల్ తోనే
చైనాకు చెందిన చాలా స్మార్ట్‌ఫోన్లు కస్టమ్‌ యూఐతో వచ్చినా, అవన్నీ ఆండ్రాయిడ్‌ ఆధారంగా పనిచేయాల్సిందే. మరో దారిలేదు. భారత్‌ వంటి దేశాల్లో జీ-మెయిల్‌, యూట్యూబ్‌, మ్యాప్స్‌, డ్రైవ్‌లు ఇలా గూగుల్‌ అందించే సేవలను విస్తృతంగా వినియోగిస్తుంటారు. అవి లేకుండా ఫోన్లు వినియోగించే వారు చాలా అరుదు. 

సగం హువావే ఫోన్ల విదేశాలకే ఎగుమతి
ఈ పరిస్థితుల్లో గూగుల్‌ సేవలు లేకుండా హువావే ఫోన్లు కొనుగోలు చేయాంటే వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇది హువేవాకు అతిపెద్ద సమస్యగా పరిణమించవచ్చు. 2018లోనే 208 మిలియన్ల హువావే ఫోన్లను తయారు చేస్తే, దాదాపు అందులో సగంపైగా ఫోన్లను చైనా నుంచి ఇతర దేశాలకు షిప్‌మెంట్‌ చేశారు. 

ఇలాగైతే చైనాలోనే హువావే మనుగడ
ప్రస్తుత పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగితే, ఆ ఫోన్ల కొనుగోళ్లు బాగా పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం చైనాలో మాత్రమే హువావే మనుగడ సాగించగలదని అంటున్నారు. ‘ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లలా మిగిలిపోతాయి’ అని ఆసియా-పసిఫిక్‌ ఐడీసీ రీసెర్చ్‌ ఉపాధ్యక్షుడు బ్రయాన్‌ మా అభిప్రాయపడ్డారు. గూగుల్‌ యాప్‌లు లేని ఫోన్లను వినియోగదారులు ఎక్కువ కాలం వినియోగించలేరని పేర్కొన్నారు. 

విపణిలోకి హువావే అనుబంధ ‘హానర్ 20’
హువావేపై ఆంక్షలు అమలులో ఉన్నా దాని అనుబంధ స్మార్ట్ ఫోన్ సంస్థ హానర్.. తాజాగా వినియోగదారులకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావే సబ్-బ్రాండ్ ఆనర్ శుభవార్త అందించింది. లండన్ వేదిక జరిగిన ఓ కార్యక్రమంలో ఆనర్ 20 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్ ఫోన్లలో హానర్ 20, హానర్ 20 ప్రో, హానర్ 20 లైట్ ఫోన్లు అడుగుపెడతాయి.

రూ.38 వేలకు ‘హానర్ 20’
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆనర్ 20 స్మార్ట్‌ఫోన్ రూ. 38,800 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మలేషియాలో ఈ నెలలో ఆనర్ 20 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ. 22,000కే లభిస్తోందని సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లోకి జూన్ 11వ తేదీన ఆనర్ 20 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.