Asianet News TeluguAsianet News Telugu

ఓటీపీ లేకుండానే.. డెబిట్ కార్డుల నుంచి క్యాష్ స్వాహా

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు అన్ని బ్యాంకుల ఖాతాదారులను సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ ఖాతాదారులు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పకున్నా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేసుకుంటున్నారు.

With out OTP, Money withdrawals from Debit and Credit Cards
Author
Hyderabad, First Published Mar 15, 2020, 12:34 PM IST

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రూట్ మార్చేశారు.. మీరు డెబిట్, క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, వెంటే వాటిని మార్చేసుకోండి అని వివిధ బ్యాంకుల పేరిట ఖాతాదారులను హెచ్చరించినట్లు హెచ్చరించి తమ పని కానిచ్చేస్తున్నారు. మీ కార్డు మార్చుకోకుంటే ఏటీఎం నుంచి నగదు రాదని బెదిరింపులకు దిగుతున్నారు. 

ఇలా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు అన్ని బ్యాంకుల ఖాతాదారులను సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ ఖాతాదారులు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పకున్నా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేసుకుంటున్నారు.

తర్వాత సదరు నగదును ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఈ-బీ, పేటీఎం వంటి ఈ వ్యాలెట్లను బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్ నేరగాళ్లు వినియోగించుకుంటున్నారు. కొద్ది నెలలుగా ఈ తరహా మోసాలకు తెర తీశారు. కేవలం నెల రోజుల్లోనే రూ.60 లక్షల మేరకు ఈ-వ్యాలెట్ల ద్వారా బదిలీ చేసుకున్నారు. 

ఒక్కో వ్యాలెట్‌లోకి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తుండటంతో వ్యాలెట్ల నిర్వాహక సంస్థలు క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. ముందుగా ఎస్సెమ్మెస్ సందేశాలను పంపిన సైబర్ నేరగాళ్లు బాధితులకు అనుమానం రాకుండా నాలుగైదు రోజుల తర్వాత నగదు బదిలీ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

డెబిట్ కార్డులకు గల ఇంటర్నెట్ లావాదేవీల సౌకర్యాన్ని వేర్వేరు మార్గాల్లో తెలుసుకుంటున్న సైబర్ మోసగాళ్లు ఆన్ లైన్ లావాదేవీలను నిర్వహిస్తున్న వారి ఖాతాలలో నుంచి నగదు బదిలీ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ఖాతాలో నుంచి రూ.2.50 లక్షలను నగదు బదిలీ చేసుకున్నారు. 

గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి 2020 మార్చి ఐదో తేదీ వరకు ఈ హైదరాబాద్ మహిళ ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్ చేశారు. ఈ సంగతి తెలుసుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆన్ లైన్ లావాదేవీలను పరిశీలించారు. 

మోసగాళ్లు ప్రతిసారి రూ.2000, రూ.3000 చొప్పున ఈ-వ్యాలెట్ లోకి మార్చుకుంటున్నట్లు గుర్తించారు. తాను ఓటీపీ చెప్పలేదని, ఇదెలా జరిగిందో తనకు తెలియడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 

జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లతో ఈ- వ్యాలెట్ల ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. దీన్ని సైబర్ మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. 

మొబైల్ యాప్‌ల నుంచి ఈ- వ్యాలెట్లలో నేరస్థులు తమ బినామీ పేర్లతో ఖాతాలు తెరుస్తున్నారు. అందులో రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకు క్యాష్ ఉంచుతున్నారు. 

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇతరుల ఖాతాల్లో నుంచి తమ బినామీ ఖాతాల్లోకి నగదు జమ చేసుకుంటున్నారు. పేటీఎం, ‘ఎఫెక్స్ మార్ట్’, ‘ఫోన్ పే’, ఫ్రీ చార్జ్, సీసీ ఎవెన్యూ, వీ పే, మై పైసా, వన్ పే తదితర ఈ వ్యాలెట్ల ద్వారా సైబర్ నేరస్తులు బాధితుల ఖాతాల నుంచి నగదు లాగేస్తున్నారు.

డెబిట్, క్రెడిట్ కార్డు దారుల నుంచి ఓటీపీ చెప్పకున్నా నగదును తీసేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ నగదు నేరుగా తమ ఖాతాల్లో జమ చేసుకోకుండా ఈ-వ్యాలెట్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల తర్వాత తమ ఖాతాలోకి జమ చేసుకుంటున్నారు. 

బాధితులు ఫిర్యాదు చేస్తే చెల్లింపులు ఆగిపోతాయని గ్రహించిన సైబర్ నేరగాళ్లు తెలివిగా ఒక్కొక్కరూ రెండంకెల సంఖ్యలో ఈ-వ్యాలెట్లను ఎంచుకుని వాటిల్లో రూ.5000, రూ.10,000 వరకు బదిలీ చేసుకుంటున్నారు. ఒక్కోసారి రూ.100 కూడా బదిలీ చేసుకుంటున్న దాఖలాలు ఉన్నాయని సైబర్ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios