Asianet News TeluguAsianet News Telugu

విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ నిష్క్రమణ: ఇక దాతృత్వానికే ఫుల్ టైమ్


ఒకనాడు సాధారణ సంస్థగా ప్రారంభమైన విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ వచ్చేనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. తన తనయుడు రిషద్ ప్రేమ్ జీకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక నుంచి దాతృత్వ కార్యాలకే ఫుల్ టైమ్ కేటాయించనున్న అజీం ప్రేమ్ జీ 2024 వరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు.

Wipro Founder Azim Premji To Retire By End-July
Author
New Delhi, First Published Jun 7, 2019, 12:08 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రోకు నూతన సారథి రానున్నారు. ఆ కంపెనీ వ్యవస్థాపకులు, ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అజీమ్‌ హెచ్ ప్రేమ్‌జీ ఈ ఏడాది జూలై 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. తన తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీకి బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం రిషద్‌ ప్రేమ్ జీ సంస్థ ముఖ్య వ్యూహాత్మక అధికారిగా, నాస్‌కామ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

‘ప్రేమ్‌జీ గత 53 సంవత్సరాలుగా కంపెనీని సమర్థంగా నడిపించారు. వచ్చే నెలలో ఆయన 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఆయన ప్రస్తుత పదవీ కాలం జూలై 30వ తేదీన ముగియబోతోంది’అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అజీం ప్రేమ్ జీ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక ఛైర్మన్‌గా 2024 జూలై వరకు అంటే అయిదేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. విప్రో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అబిదాలీ జెడ్‌.నీముచ్‌వాలాను తిరిగి నియమిస్తున్నట్లు బోర్డు తెలిపింది. 

రిషద్‌ ప్రేమ్‌జీని పూర్తి కాల డైరెక్టర్‌గా అయిదేళ్ల కాలానికి తిరిగి నియమిస్తూ తీర్మానం చేసింది. ఆయన 2019 జులై 31 నుంచి 2024 జూలై 30వ తేదీ వరకు ఈ పదవిలో ఉంటూ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మార్పులు వాటాదార్ల అనుమతితో 2019 జూలై 31వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ వంటి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న అజీమ్‌ ప్రేమ్‌జీ పదవీ విరమణ తర్వాత ఎక్కువ టైం దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించనున్నారు. మన దేశ చరిత్రలోనే దాతృత్వం అంటే ఎక్కువగా వినిపించే పేరు ప్రేమ్‌జీదే.

గత మార్చి నెలలో కూడా కంపెనీకి చెందిన రూ.52,750 కోట్ల విలువైన షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసమే అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు బహుమతిగా అందించారు. ప్రేమ్‌జీ నియంత్రణలో ఉన్న పలు కంపెనీల్లోని 34 శాతం వాటాలను ఆయన ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రేమ్ జీ ఫౌండేషన్ బదిలీ చేసిన అజీం ప్రేమ్ జీ విలువ సుమారు రూ.1.4 లక్షల కోట్లు. వీటిపై వచ్చే లాభాలతోనే ఫౌండేషన్‌ పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా విద్యా రంగంలో ఈ స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తోంది. లాభాపేక్ష లేని సుమారు 150 సంస్థలకు ఆర్థికంగా గ్రాంట్లు విడుదల చేస్తోంది.

‘సుదీర్ఘ, సంతృప్తికర  ప్రయాణం కొనసాగించా. భవిష్యత్‌లో ఎక్కువ సమయం దాతృత్వ కార్యక్రమాలకే కేటాయించాలని అనుకుంటున్నా. నా తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కంపెనీని మరో స్థాయికి తీసుకెళ్లగలిగే సత్తా అతనికి ఉంది’అని అజీమ్‌ ప్రేమ్‌జీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

‘పటిష్ట విలువల పునాదులు, రాజీ లేని విధానాలతోనే విప్రో గత కొన్ని దశాబ్దాలుగా విజయాలు అందుకుంటూ వచ్చింది. భవిష్యత్‌లోనూ  మా వాటాదార్లకు మంచి విలువ అందించేందుకు కృషి చేస్తా’అని కొత్తగా ఎంపికైన ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ చెప్పారు.

ఒకనాడు చిన్న స్థాయి నూనె తయారీ సంస్థగా మొదలైన విప్రో నేడు 8.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.60 వేల కోట్లు) కంపెనీగా అవతరించిందంటే దాని వెనుక ప్రేమ్‌జీ కృషి చాలా ఉంది. గత 53 ఏళ్లుగా ఆయన నిరంతరం శ్రమిస్తూ సంస్థను ముందుకు నడిపించారు. 

అంతర్జాతీయ ఎఫ్‌ఎంఎస్‌జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌, మెడికల్‌ డివైజెస్‌ పవర్‌హౌస్‌గా విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను తీర్చిదిద్ది, ఏడాదికి 2 బిలియన్‌ డాలర్ల (రూ.14వేల కోట్లు) ఆదాయం ఆర్జించే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎనలేనిది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ఛైర్మన్‌గా ఉంటూ, విప్రో-జీ ఈ హెల్త్‌కేర్‌ బోర్డులో ఆయన కొనసాగుతారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios