న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ తన యూజర్ల కోసం అప్ డేట్ చేస్తూ ఉంటుంది. రకరకాల వసతులను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరో ఫీచర్ తెచ్చింది. దీని ద్వారా ఇక నుంచి కొత్త కాంటాక్ట్ నంబర్లను మొబైల్ ఫోన్‌లో టైపు చేయకుండానే యాడ్ చేసుకోవచ్చు. 

కేవలం సంబంధిత వ్యక్తి ఫోన్‌ వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూలోకి వెళ్లి టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి ఆ పై పేరు సేవ్ చేస్తాం. 

ఒకటి, రెండు ఫోన్ నంబర్లయితే ఓకే కానీ పదుల సంఖ్యలో ఉంటే ఒక్కోసారి ఇబ్బంది తప్పదు. మనం కొన్నిసార్లు కొత్త నంబర్లను యాడ్ చేసుకోవడం కోసం ఇబ్బందులు పడుతుంటాం. ఒక నంబర్ తప్పుగా ప్రెస్ చేసినా ఇతరుల నంబర్ ఫీడ్ అవుతుంది. 

ఇకపై అలాంటి ఇబ్బందులకు చరమ గీతం పాడుతూ, పొరపాట్లకు తావు లేకుండా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ఈజీగా నంబర్ యాడ్ చేసుకునేందుకు వాట్సాప్ యూజర్ల‌కు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

దీని కోసం మనం ఎవరైతే నంబర్ యాడ్ చేసుకోవాలో వాళ్ల వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆ నంబర్ కాంటాక్ట్ లో చేరిపోతుంది. దీంతో మ్యానువల్‌గా టైప్‌ చేస్తే జరిగే పొరపాట్లను అరికట్టవచ్చు. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లోనే ఉంది. 

అతి త్వరలోనే తన యాజర్లందరికి అందుబాటులోకి తెస్తామని  వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ సెట్టింగ్స్ మెనూలో ఈ ఆప్షన్ తీసుకు రానున్నారు. అదే జరిగితే మాన్యువల్‌గా సేవ్ చేసుకోవాల్సిన కాంటాక్టులన్నీ ఒక్క స్కాన్ తోనే జత కలుస్తాయి. 

also read:కరోనా కట్టడిపైనే ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్.. తేల్చేసిన ‘నిర్మల’మ్మ

ఇంతకుముందు నలుగురితో మాత్రమే వీడియో ఫోన్ కాల్ వసతి గల వాట్సాప్‌లో ‘కరోనా లాక్ డౌన్’ వల్ల ఆ ఫీచర్‌ను అప్‌డేట్ చేసి ఒకేసారి 50 మందితో వీడియో కాల్‌కు అనుకూలంగా మార్చేసింది. 

ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ ఇతర సేవలు కూడా అందిస్తున్నది. ఇటీవల రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఫేస్ బుక్ సంస్థ కోసం రిలయన్స్ ’ఈ-కామర్స్’ బిజినెస్‌లో కీలకం కానున్నది.