న్యూఢిల్లీ: వాట్సాప్ యూజర్లకు మరో అద్భుత ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత, గ్రూప్ సంభాషణల్లో యూజర్లు పంపే మెసేజ్‌లు అవతలి వారికి ఎంత సేపు కనిపించాలో ముందే నిర్ణయించే సౌకర్యం వినియోగంలోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్ అయ్యేలా ఈ ఫీచర్ పనిచేస్తుందని ఓ టెక్ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ బీటా వీ2.19.275 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది వాట్సాప్.

ఒక వాట్సాప్ యూజర్ మరో వాట్సాప్ యూజర్‌కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. ఇలా ఈ ఫీచర్‌ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్ అవుతాయి. తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది.

మొదట ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్ లోని గ్రూప్ చాటింగుల్లో పరీక్షించింది వాట్సాప్. తర్వాత వ్యక్తిగత సంభాషణలకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 'డిలీట్ బోత్' అనే ఫీచర్ ఇంచుమించు ఇలాంటి వసతులతో అందుబాటులో ఉంది. 

దీని ద్వారా ఒకరికి పంపాల్సిన సందేశం వేరొకరికి పంపినప్పుడు.. లేదా ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ సందేశాన్ని పూర్తిగా డిలీట్ చేయొచ్చు. గరిష్ఠంగా సందేశం పంపిన గంటలోపు డిలీట్ బోత్ సదుపాయం వినియోగించే అవకాశముంది. ముఖ్యంగా యూజర్ మాన్యువల్గా ఈ సదుపాయం వినియోగించాల్సి ఉంటుంది.