కాలిఫోర్నియా: సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నా.. దాని అనుబంధ ‘వాట్సాప్‌’సంస్థతో మంచి ప్రయోజనాలు పొందుతోందని ‘యాప్‌ అన్నె’ అనే పేర్కొంది. ఆ సంస్థ రూపొందించిన ’దీ స్టేట్ ఆఫ్ మొబైల్ 2019’ నివేదిక ప్రకారం మెసేజింగ్ యాప్‌ ‘వాట్సాప్’ గతేడాది ఫేస్‌బుక్‌ను అధిగమించి ముందు వరసలో నిలిచింది. గత 24 నెలల్లో వాట్సాప్‌ 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ మెసెంజర్‌ 20 శాతం, 15 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. 

ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రాం కూడా దూసుకుపోతుందని, గత రెండేళ్ల 35 శాతం వృద్ధిని నమోదు చేసిందని ‘యాప్‌ అన్నె’తెలిపింది. నెలవారీ చురుగ్గా ఉన్న యూజర్ల ప్రకారం ఫేస్‌బుక్‌ ఇప్పుడు అంత పాపులారిటీ ఉన్న అప్లికేషన్ కాదని వ్యాఖ్యానించింది. యూజర్‌ ఎంగేజ్‌మెంట్ ప్రకారం అన్ని యాప్స్‌తో పోల్చుకుంటే వాట్సాప్‌ ముందువరసలో ఉంది. సులభంగా వాడేలా ఉండటం, బేసిక్‌ ఫీచర్స్‌ అందుబాటులో ఉండటమే వాట్సాప్ దూసుకుపోవడానికి కారణమని వివరించింది.

బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, బ్రిటన్ వంటి దేశాల్లో వాట్సాప్‌ రాజ్యమేలుతోంది. అమెరికా ఫ్రాన్స్‌ల్లో స్నాప్‌ ఛాట్, చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలను వి ఛాట్, లైన్‌, కకోవాటాక్‌ వంటి యాప్‌లు ఏలుతున్నాయి. 2017తో పోల్చుకుంటే ఈ యాప్స్‌లో గడిపే సమయాల్లో కాస్త తగ్గుదల నమోదైందని తెలిపింది. ఇతర యాప్స్‌ను వాడటం దానికి కారణమని ‘యాప్‌ అన్నె’వివరించింది.

ఫ్రీ కాల్స్‌కు హిస్టారికల్ డిమాండ్ రావడంతోపాటు వినియోగదారులు తేలిగ్గా వాడేందుకు అనుకూలంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా వాట్సాప్ భారీగా లబ్ధి పొందుతున్నది. గమ్మత్తేమిటంటే వాట్సాప్ యూజర్ల బేస్ ఎంత మంది అన్న సంగతి ‘యాప్ అన్నె’ బయటపెట్టలేదు. గతేడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి అంతర్జాతీయంగా 150 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారని, భారతదేశంలో 20 కోట్ల మంది ఉండొచ్చునని అంచనా.