న్యూఢిల్లీ: ఫొటోలు, వీడియోలు, సందేశాలు పంపుకోవడంతోపాటు కాల్స్ చేసుకునే వసతి కల్పిస్తున్న మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరో రెండు నెలల్లో ఆర్థిక రంగంలోకి అడుగు పెట్టనున్నది. తన ఖాతాదారులను ‘చెల్లింపు’ సేవలను అందుబాటులోకి తేనున్నది. డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనలను పాటించడానికి రెండు నెలలు పట్టవచ్చునని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.  

‘వాట్సాప్ చెల్లింపుల సేవలు ప్రారంభించినా, వ్యవస్థలో నగదు చలామణిపై ప్రభావం చూపడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుంది‘ అని ఎన్పీసీఐ ముఖ్య కార్య నిర్వహణాధికారి దిలీప్ అస్బే చెప్పారు. ఏడాది కాలంగా వాట్సాప్ చెల్లింపుల సేవలను ప్రయోగాత్మకంగా కొందరు ఖాతాదారులకు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందరికి పేమెంట్స్ సేవలు అందుబాటులోకి వస్తే 30 కోట్ల మంది వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది. 

ప్రస్తుతం పేమెంట్స్ సర్వీసుల్లో మొదటి స్థానంలో ‘సెర్చింజన్’ గూగుల్ పే నిలిచింది. ప్రస్తుతం ప్రయోగాత్మక సేవల్లో 10 లక్షల మందికి సేవలందిస్తున్నది వాట్సాప్. అయితే తమ ఖాతాదారుల డేటాను స్థానికంగానే నిల్వ చేయాలన్న ఆర్బీఐ నిబంధనలను అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. అయితే స్థానికంగా డేటా నిల్వ చేస్తే విదేశాల్లోని సర్వర్లలో అదే డేటాను 24 గంటల్లో తొలిగించేయాల్సి ఉంటుంది. 

చైనాకు చెందిన షియోమీ, అమెరికాకు చెందిన ఈ-కామర్స్ రిటైలర్ అమెజాన్ అనుబంధ అమెజాన్ పే, ట్రూ కాలర్ సంస్థలు ‘లోకలైజేషన్ డేటా’ నిబంధనల అమలుకు ముందుకు రాలేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే చెప్పారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది యూజర్లు డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. 30 కోట్ల మందికి చేరుకుంటే నగదు చలామణిపై ప్రభావం ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు, 10 లక్షల క్యూఆర్ కోడ్స్ చురుగ్గా ఉన్నాయి. ఐదొంతుల ప్రగతి సాధిస్తేనే డిజిటల్ పేమెంట్స్ లక్ష్యాలను చేరుకోగలమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే తెలిపారు. 

వివిధ బ్యాంకులు రూపే కార్డు చెల్లింపుల దిశగా మళ్ళుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే చెప్పారు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. ఎస్బీఐ రూపే కార్డుల జారీ దిశగా చర్యలు చేపట్టింది. రూపే కార్డుల జారీకి ఆర్బీఐ పెట్టిన అక్టోబర్ 15 గడువును కొన్ని బ్యాంకులు మిస్ అవుతున్నాయన్నారు.