Asianet News TeluguAsianet News Telugu

హెచ్1-బీ వీసాల రద్దు: షాక్‌లో ఇండియన్ ఐటీ.. బట్ నో ‘ప్రాబ్లం’

భారతీయులకు ఇతర వీసాలతోపాటు హెచ్‌1బీ వీసాలను అమెరికా రెండేళ్లపాటు రద్దు చేయడంతో భారత్‌కు చెందిన 200 బిలియన్‌ డాలర్ల ఐటీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.  ఒక్క ఉత్తర అమెరికా ప్రాంతం నుంచే భారత ఐటీ పరిశ్రమకు 70 శాతం రెవెన్యూ రావడం అందుకు కారణం.

Visa Suspension Wont Cripple Indian IT Sector
Author
New Delhi, First Published Jun 28, 2020, 11:47 AM IST

న్యూఢిల్లీ: భారతీయులకు ఇతర వీసాలతోపాటు హెచ్‌1బీ వీసాలను అమెరికా రెండేళ్లపాటు రద్దు చేయడంతో భారత్‌కు చెందిన 200 బిలియన్‌ డాలర్ల ఐటీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.  ఒక్క ఉత్తర అమెరికా ప్రాంతం నుంచే భారత ఐటీ పరిశ్రమకు 70 శాతం రెవెన్యూ రావడం అందుకు కారణం.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికుల వీసాలపై కొనసాగిన అనిశ్చిత పరిస్థితుల్లో భారతీయ పరిశ్రమ చిన్న చిన్న ప్రత్యమ్నాయాలను అనుసరించింది. ఇప్పుడు అలాంటి ప్రత్యమ్నాయాలే పరిశ్రమను రక్షించగలవని కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. 

భారత ఐటీ పరిశ్రమ ‘స్వీయలంబన’ సాధించాల్సిందేనని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. ప్రధానంగా హెచ్‌1బీ వీసాలపైనే ఆధారపడే పరిస్థితి నుంచి భారతీయ పరిశ్రమ క్రమంగా బయట పడేందుకు ప్రయత్నిస్తోంది.

అమెరికాలో అత్యధిక ఉద్యోగులను కలిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అమెరికాలో పది వేల మంది ఉద్యోగులను కలిగిన రెండో పెద్ద సంస్థ ఇన్ఫోసిస్, అజీమ్‌ ప్రేమ్‌జీ నాయకత్వంలోని విప్రో కంపెనీలు అట్లాంటా, మిచిగాన్‌ రాష్ట్రాల్లో యూనివర్సిటీ‌ల నుంచే క్యాంపస్‌ సెలక్షన్లను చేపడుతున్నాయి.  

ఒక్క టెక్‌ మహేంద్రా 2017లోనే దాదాపు రెండువేల మంది అమెరికన్లను నియమించుకుంది. స్థానిక నియామకాలకే ఇప్పుడు కూడా ఆ కంపెనీ ప్రాధాన్యం ఇస్తోంది. 

భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడంతో స్వల్ప కాలికంగా భారత ఐటీ కంపెనీలు లబ్ది పొందవచ్చునేమోగానీ దీర్ఘకాలికంగా మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థకే లాభదాయకమని, ఈ సంగతి ఆ దేశం కూడా ఏదో ఒక రోజున గ్రహించక పోదని గుర్నాని అభిప్రాయపడ్డారు. అమెరికాలోనే కాకుండా అమెరికాతో ‘బిజినెస్‌ ఫ్రెండ్లీ’గా ఉంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కూడా భారత ఐటీ కంపెనీలు తమ సేవలను విస్తరించాయి. 

అలా మెక్సికోలో టీసీఎస్, విప్రో కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయగా, ఇన్ఫోసిస్‌ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. మెక్సికోలో దాదాపు పది ఐటీ దిగ్గజ కంపెనీలు ఉన్నట్లు భారత్‌లోని మెక్సికో రాయబారి మెల్బాప్రియా తెలిపారు.

గిగ్‌ ఎకానమీ బాగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోకి ఐటీ కంపెనీలకు అవసరమైన నిపుణులు స్థానికంగానే దొరకుతారు. భారత్‌లో కూడా ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఐటీ నిపుణులు అమెరికా వీసాలపైనే ఎక్కువగా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ‘టాలెంట్‌ 500 ఏఎన్‌ఎస్‌ఆర్‌’ లాంటి సంస్థలూ అంటున్నాయి.

అమెరికాలో జాత్యాహంకార గొడవలు పెరుగుతున్న సమయంలో భారత ఐటీ నిపుణులు వెనక్కి వచ్చేందుకు కూడా ఇష్టపడవచ్చని ఐటీ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వీసాల రద్దు పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, స్వావలంబన సాధించగలమని వారంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios