న్యూయార్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వినియోగదారుల సమాచారం, ప్రైవేటు సందేశాలు, కాంటాక్టు సమాచారాన్ని ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి టెక్‌ సంస్థలకు అందజేసినట్టు ఫేస్‌బుక్‌ అంతర్గత పత్రాల్లో బయటకు పొక్కింది. దాదాపు 150 కంపెనీలకు ఫేస్‌బుక్ అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఈ సమాచారం పొందిన వాటిలో టెక్నాలజీ, ఆన్‌లైన్‌ రీటెయిలర్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సైట్లు, వాహన సంస్థలు, మీడియా సంస్థలు ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌, స్పోటిఫై సంస్థలకు వినియోగదారుల ప్రైవేట్  సమాచారం చదివేందుకు ఫేస్‌బుక్ అనుమతి ఇచ్చింది. వినియోగదారుల అనుమతి లేకుండా మైక్రోసాఫ్ట్‌ సెర్చింజిన్‌ ‘బింగ్’‌కు స్నేహితుల పేర్లు చూసేందుకు అంగీకరించింది. ఫేస్‌బుక్‌లోని మిత్రుల ద్వారా వినియోగదారుల పేర్లు, కాంటాక్టు సమాచారం తెలుసుకొనేలా ఆ సంస్థ ద్వారాలు తెరిచిందని ది న్యూయార్క్‌ తెలిపింది. ఇంతకు ముందే కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంతో ఫేస్‌బుక్‌కు చెడ్డపేరు వచ్చింది.

డేటా లీకేజీపై పలు దేశాలు ఫేస్ బుక్ సీఈఓ జుకర్‌బర్గ్‌కు నోటీసులు ఇచ్చాయి. ఆయన బహిరంగంగానే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. మరోసారి ఇలా చేయబోమని, వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించబోమని హామీ ఇచ్చారు. వినియోగదారుల అనుమతి లేకుండా సమాచారం ఇతరులతో పంచుకోబోమని 2011లో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) ఒప్పందంలో ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇప్పుడేమో అనుమతి లేకుండానే థర్డ్‌పార్టీ సంస్థలకు సమాచారం తీసుకొనేందుకు అనుమతినిచ్చిందని ఎఫ్‌టీసీ వినియోగదారుల భద్రతా బ్యూరో ప్రతినిధి డేవిడ్‌ లాడెక్‌ తెలిపారు.

270 అంతర్గత పత్రాలు, 50 మంది ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగులతో జరిపిన ముఖాముఖీలో ఈ సంగతి బయటపడింది. ఫేస్‌బుక్‌ సెట్టింగ్స్‌లో షేర్‌ చేసుకోకుండా డిసేబుల్‌ చేసినా సమాచారం ఇతరులు తీసుకోగలుగుతున్నారని ఆ పత్రాలు తెలిపాయి. ఫేస్‌బుక్‌కు భాగస్వామ్య కంపెనీల నుంచి కొత్త ఖాతాదారులు చేరారు. మరోవైపు భాగస్వామ్య కంపెనీలు తమ ప్రోడక్ట్స్‌కు కొత్త ఫీచర్లు చేర్చేందుకు ఈ సమాచారం ఉపయోగపడినట్లు తెలిపింది.

కాగా, న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనాలను ఫేస్‌బుక్ తోసిపుచ్చింది. తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని కొన్ని సంస్థలు తమను సంప్రదించినట్లు అంగీకరించిన ఫేస్‌బుక్.. ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు తాము అంగీకరించలేదని స్పష్టం చేసింది. ఖాతాదారుల అనుమతి లేకుండా తమ భాగస్వాములతో వారి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోబోమని మరోసారి సెలవిచ్చింది.