Asianet News TeluguAsianet News Telugu

ఇది పక్కా: 2021కల్లా 4జీ సర్వీసెస్ ‘స్టాండర్డ్’..2జీ &3జీ ఔట్?!!

రెండేళ్ల క్రితం 4జీ సేవలు టెలికం రంగంలో అడుగు పెట్టిన తర్వాత 2జీ వినియోగదారుల సంఖ్య శరవేగంగా తగ్గిపోతున్నది.

User base for 2G, 3G shrinking as upwardly mobile take to 4G
Author
New Delhi, First Published Mar 3, 2019, 10:52 AM IST

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం 4జీ సేవలు టెలికం రంగంలో అడుగు పెట్టిన తర్వాత 2జీ వినియోగదారుల సంఖ్య శరవేగంగా తగ్గిపోతున్నది. కానీ దేశీ టెలికం రంగంలో ఇప్పటికీ 2జీ వినియోగదారులదే మెజారిటీ. వచ్చే రెండేళ్లలో టెలికాం పరిశ్రమలో ప్రామాణిక సర్వీసుగా 4జీ అవతరించనున్నదని విశ్లేషకులు అంటున్నారు.

చౌకగా 4జీ సేవలు ప్లస్ డేటా ప్యాకేజీలు
4జీ స్మార్ట్‌ఫోన్లతోపాటు డేటా ప్యాకేజీలు చౌకగా లభిస్తుండటంతో వినియోగదారులు నేరుగా 2జీ నుంచి 4జీ సర్వీసులకే మారుతున్నారు. దీనికి తోడు రిలయన్స్‌ జియో వోల్టేజీ టెక్నాలజీతో కూడిన ఫీచర్‌ ఫోన్లను అత్యంత చౌకగా అందిస్తోంది. 

అపరిమిత ఫోన్ కాలింగ్ కోసం రిలయన్స్ జియో వైపు మొగ్గు
దాంతో అపరిమిత కాలింగ్‌ సదుపాయం కోసం రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ కొనుగోలు చేయడంతోపాటు 4జీ సేవలకు మారుతున్న వారు గణనీయంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్‌ గ్రామాలు, పట్టణాల్లో.. అది కూడా పెద్దవారిలో ఎక్కువగా కన్పిస్తోంది.

నవంబర్ కల్లా 58 శాతానికి 2జీ కస్టమర్ల సంఖ్య
2017లో 70 శాతంగా ఉన్న 2జీ వినియోగదారుల వాటా గత ఏడాది నవంబర్ నాటికి 58 శాతానికి పడిపోయింది. 2021నాటికి 2జీ సర్వీసులు కనుమరుగుకావచ్చని టెలికం రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2జీతోపాటే 3జీ కూడా మరుగున పడిపోవచ్చని తెలుస్తోంది.

రిలయన్స్ జియో వాటాదారులు 65 శాతం
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో 4జీ సేవల వినియోగదారుల సంఖ్య 85 శాతం పెరిగి 43.25 కోట్లకు చేరుకున్నది. అందులో రిలయన్స్‌ జియో కస్టమర్ల వాటే 65 శాతం. కేవలం 4జీ సేవలు అందిస్తున్న రిలయన్స్‌ జియో యూజర్ల సంఖ్య గత ఏడాది 75 శాతం పెరిగి 28.01 కోట్లకు చేరుకున్నది.

11 శాతం వొడాఫోన్ ఐడియా, 22.5% తగ్గిన ఎయిర్ టెల్ కస్టమర్లు
గత ఏడాదిలో వొడాఫోన్‌ ఐడియా 2జీ కస్టమర్లు 11% తగ్గి 27.93 కోట్లకు, ఎయిర్‌టెల్‌లో 22.5% తగ్గి 17.67 కోట్లకు చేరుకుంది. అంతేకాదు డేటా రేట్లు రోజుకు 1.4$ (రూ.100)లకు చేరే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. 

వేలానికి రూ.3,300 కోట్ల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బాకీలు
ప్రభుత్వరంగ బ్యాంకైన ‘సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ రూ. 3,300 కోట్ల విలువైన మొండి బాకీలను ‘సర్ఫేసీ’ చట్టం కింద వేలానికి వేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా నాలుగు ఖాతాలకు చెందిన మొండి బాకీలు ఉన్నాయని బ్యాంకు తెలిపింది.  బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌ (రూ.1,251 కోట్లు), భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ (రూ.1,550.07 కోట్లు), ఎస్సార్‌ స్టీల్‌ (రూ.423 కోట్లు) విలువైన మొండి బాకీలు ఉన్నట్లు వివరించింది. 

రేయాన్స్ మినహా మూడు సంస్థలు ఎన్సీఎల్టీ పరిదిలోకి
బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌ తప్ప మిగతా మూడు కంపెనీలు ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్) పరిధిలో ఉన్నాయని వెల్లడించింది. ‘బ్యాంకు పాలసీ,రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలకనుగుణంగా ఈ ఆస్తులు అమ్మకం జరుగుతుంది. వీటిని బ్యాంకులు, ఏఆర్‌సీ(అసెంట్‌ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు), ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) షరతులకు లోబడి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆస్తుల వేలానికి ఇంకా బ్యాంకు అథారిటీ ఆమోదం తెలపాల్సి ఉంది’అని బ్యాంకు ఒక నోటీసులో తెలిపింది. వేలంలో పాల్గొనే వారు మార్చి 20లోపు బిడ్లను దాఖలు చేయాలని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios