వాషింగ్టన్: హెచ్1బీ దరఖాస్తు నిబంధనలను అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది.  ఉద్యోగుల నియామక సంస్థల లేబర్ అప్లికేషన్ విధానంలో కొత్త ఆంక్షలు విధించింది. హెచ్1బీ వీసాల విషయమై ట్రంప్ సర్కార్ కఠిన వైఖరితో అమెరికాలో ఉన్న చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థల భవిష్యత్ అనిశ్చితిలో పడింది. దీనికి తోడు తాజాగా మరిన్ని నిబంధనలను ముందుకు తెచ్చింది. అమెరికన్ల యాజమాన్యంలోని సంస్థలు తమ వద్ద ఎంతమంది విదేశీ ఉద్యోగులు పనిచేస్తున్నారనే వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాలని తెలిపింది. 

వాటి ఆధారంగా నూతన హెచ్1బీ దరఖాస్తులకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. భారత ఐటీ నిపుణులు ప్రధానంగా హెచ్1బీ వీసాపైనే ఆశలు పెట్టుకుంటారు. ఈ వీసా ఆధారంగానే అమెరికన్ సంస్థలు మెరికల్లాంటి విదేశీ నిపుణులను నియమించుకుంటున్నాయి. స్థానికులకే అమెరికా ఉద్యోగాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హామీని నెరవేర్చేందుకు హెచ్1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆంక్షలు, నిబంధనలను ప్రభుత్వం విధించింది. ఏదైనా సంస్థ విదేశీ ఉద్యోగికి హెచ్1బీ వీసా ఇవ్వాలంటే, సదరు కంపెనీ తన లేబర్ అప్లికేషన్‌కు కార్మికశాఖ నుంచి అనుమతి పొందాలి.

ఇందుకు లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫాంను సదరు సంస్థ కార్మికశాఖకు సమర్పించాలి. దరఖాస్తును పరిశీలించిన కార్మికశాఖ  ఫలానా పోస్టు కోసం అర్హులైన స్థానిక ఉద్యోగి ఎవరూ లేనందున, విదేశీ నిపుణుడిని నియమించుకోవచ్చని హెచ్1బీ వీసా ఇచ్చేందుకు అనుమతినిస్తుంది. ఇందుకు సంస్థ తన వద్ద ఉన్న అన్ని పోస్టుల వివరాలను(విభాగాల వారీగా), స్వల్పకాలిక ఉద్యోగుల నియామక ప్రతిపాదనలను కూడా కార్మికశాఖకు అందజేయాలి. కంపెనీలు తమ వద్ద ప్రస్తుతం పనిచేస్తున్న విదేశీ నిపుణుల వివరాలను కచ్చితంగా సమర్పించాలని, వాటి ఆధారంగా నూతన హెచ్1బీ వీసాలను జారీ అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే ఆదేశాలు జారీచేసింది. 

త్వరలోనే అదనపు వివరాలతో కూడిన అప్లికేషన్ల లభ్యత
అదనపు వివరాలతో కూడిన దరఖాస్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. విదేశీ కార్మికుల గుర్తింపు కార్యాలయం (ఓఎఫ్‌ఎల్‌సీ) వెబ్‌సైట్ నుంచి ఆ దరఖాస్తుల్ని కంపెనీలు పొందవచ్చునని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. 2017 నుంచి వీసా మోసాలపై చర్యలు తీసుకుంటున్న కార్మికశాఖ అంతటితో ఆగక.. విదేశీ నిపుణుల నియామకానికి అనుకూలంగా సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని అమెరికన్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నది. హెచ్-1 బీ వీసాలపై ఆధారపడి పని చేస్తున్న సంస్థల యాజమాన్యాలు కూడా స్పష్టమైన ఐడెంటిపికేషన్ కావాల్సి ఉంటుంది.  

టెక్కీలు వెళ్లిపోతే చిన్న సంస్థలకు శరాఘాతమే
థర్డ్‌పార్టీ కార్యక్షేత్రాల్లో విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వరుసగా విధిస్తున్న ఆంక్షల్లో భాగంగానే లేబర్ అప్లికేషన్ విధానంలో మార్పులు చేసిందని సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సంస్థ విమర్శించింది. ప్రస్తుతం హెచ్1బీ వీసాల నిరాకరణ రేటు 40శాతం దాటిందని, ఫలితంగా చాలామంది ఐటీ నిపుణులు అమెరికా నుంచి వెళ్లిపోవడం చిన్న ఐటీ కంపెనీలకు శరాఘాతంగా మారిందని ఆ సంస్థ తెలిపింది. 

యూఎస్‌సీఐఎస్ సొంత నిబంధనలు అమలు చేస్తున్నదన్న విమర్శలు
హెచ్1బీ వీసాల విషయంలో ప్రభుత్వ చట్టాలకు బదులుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) సొంత నిబంధనలను అమలు చేస్తున్నదన్న విమర్శలు చాలారోజులుగా వినిపిస్తున్నాయి. చట్టాల్లో లేని విధానాలను అవలంబిస్తున్న యూఎస్‌సీఐఎస్.. మెమోలు, వెబ్‌సైట్లలో సవరణల ద్వారా నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నదని చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ విషయమై ఐటీ సర్వ్ అలయన్స్ ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.

జన్మత: పౌరసత్వ హక్కు ఒక వెర్రి అన్న ట్రంప్
జన్మతః పౌరసత్వపు హక్కు ఓ వెర్రి విధానమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అది దేశంలో బర్త్ టూరిజం పెరిగేందుకు కారణమైందని, దాని ద్వారా చైనీయులు ఎక్కువ లాభపడుతున్నారని అన్నారు. అమెరికా భూభాగంపై జన్మించిన బిడ్డలకు పుట్టుకతోనే పౌరసత్వం లభించేలా రాజ్యాంగం ప్రసాదించిన జన్మతః పౌరసత్వపు హక్కుకు ఎసరు పెట్టేందుకు ట్రంప్ సిద్ధమైన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన ట్రంప్.. తన చర్యను సమర్థించుకునేందుకు మరోసారి ప్రయత్నించారు. జన్మతః పౌరసత్వపు హక్కు కారణంగా బర్త్ టూరిజం అనే ఓ పరిశ్రమ తయారైంది. ప్రపంచం నలుమూలలనుంచి ఏ మహిళ అయినా సరే.. కేవలం ప్రసవం కోసం అమెరికా వచ్చి పిల్లల్ని కంటే చాలు.. ఆ బిడ్డకు జీవితకాలపు పౌరసత్వం తప్పనిసరిగా దక్కుతుందనే స్థాయికి ఈ హక్కును తీసుకెళ్లారని ట్రంప్ చెప్పారు. 

జన్మ: పౌరసత్వ హక్కులను పొందుతున్న విదేశీయుల్లో చైనా ఇందులో మొదటిస్థానంలో ఉంది. ‘ఒక్కసారి ఆలోచించండి. మన శత్రువు భార్య అమెరికా గడ్డమీద బిడ్డను కంటే.. మీ పిల్లాడికి పౌరసత్వం ఇస్తున్నామని అభినందనలు చెప్పాలా?’ అని ఆయన ప్రశ్నించారు. అక్రమ వలసదారులకు పుట్టే ప్రతి బిడ్డకు సహజంగానే పౌరసత్వం దక్కాలని ప్రతిపక్ష డెమోక్రాట్లు కోరుకుంటున్నారని విమర్శించారు. ఏండ్ల తరబడి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులు, ఇతర నిపుణులైన విదేశీయులను త్వరలోనే దేశంలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు.