వాషింగ్టన్: గత ఏడాదిలో పది అతిపెద్ద ఐటీ కంపెనీలు కొత్తగా 1,14,390 మంది నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చాయని అంచనా. 2017తో పోలిస్తే ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. 2017లో టాప్ 10 ఐటీ సంస్థల్లో కొత్తగా 22,516 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. 

అమెరికాలో పెరిగిన నియామకాలు
అమెరికాలో ఆయా కంపెనీల నియామకాలు పెరగడమే అనూహ్య పెరుగుదలకు అసలు కారణమని హెచ్చార్ నిపుణులు అంటున్నారు. భారత ఐటీ సంస్థల్లో 37 లక్షల మంది పని చేస్తుండగా, ఐటీ పరిశ్రమ పరిమాణం రూ.16,700 కోట్ల విలువ ఉంటుందని అంచనా.  

స్థానికులకే ఐటీ కంపెనీల ప్రాధాన్యం
డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం ఒత్తిడి పుణ్యమా? అని అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత ఐటీ కంపెనీలు అక్కడి స్థానికులకే అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతోపాటు ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులు అప్పగించే బడా క్లయింట్లు తమ ఉద్యోగులను విలీనం చేసుకోవాలని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. 

నియామక వివరాలు వెల్లడించని ఐటీ సంస్థలు
అమెరికాలో నియామకాలతోపాటు పెద్ద క్లయింట్ల ఉద్యోగులను ఎంత మందిని చేర్చుకున్న వివరాలను ఐటీ కంపెనీలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. గత ఏడాది మొత్తం నియామకాల్లో క్లయింట్ సంస్థల నుంచి విలీనమైన ఉద్యోగుల వాటానే సగం వరకు ఉండవచ్చని సమాచారం. ఈ పరిణామాలతో భారత్‌లో ఐటీ ఉద్యోగార్థుల అవకాశాలకు గండిపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
 
టాప్ 5 సంస్థల ఆధ్వర్యంలో 99,010 కొత్త కొలువులు
2018లో ఐదు అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)‌, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో కలిసి 99,010 మంది నిపుణులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాయి. 2017లో నియమించుకున్న 19,360 మందితో పోలిస్తే ఇది చాలా అధికం. గత ఏడాది చివరికల్లా ఈ ఐదు కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 12.3 లక్షల స్థాయికి పెరిగింది.

టాప్ 10లో మిగతా సంస్థల్లో 15,380 ఉద్యోగాలు
ఇక టాప్‌-10లోని మిగతా కంపెనీలైన టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ ట్రీ, సైయెంట్‌, జెన్సార్‌ 2018లో 15,380 మందికి ఉద్యోగావకాశం కల్పించాయి. 2017లో ఈ సంఖ్య 2,796గా ఉంది. 16,700 కోట్ల డాలర్ల స్థాయికి చేరిన భారత సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో ప్రస్తుతం 37 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ఐదు అగ్రశ్రేణి ఐటీ  కంపెనీల సిబ్బంది వాటా 38 శాతంగా ఉన్నది.

హెచ్1-బీ వీసా నిబంధనల కఠినతరం ఇలా
అమెరికా ప్రభుత్వం హెచ్‌1-బీ వీసాలను కఠినతరం చేయడంతోపాటు అక్కడి కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పెంచాలని భారత ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. దీంతో మన టెక్‌ కంపెనీలు తదనుగుణంగా వ్యాపార వ్యూహాన్ని మార్చుకున్నాయి. గతంతో పోలిస్తే అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలిచ్చేందుకే మొగ్గుచూపుతున్నాయి.

విప్రోలో 50 శాతం అమెరికన్లే
విప్రో అమెరికా శాఖల్లో పనిచేస్తున్న వారిలో 50 శాతానికి పైగా ఉద్యోగులు స్థానికులే ఉన్నారు. ఇక టీసీఎస్‌ 2011-17 మధ్య కాలంలో అమెరికాలో 17,000 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గత ఏడాదిలో మొత్తంగా 27,049 మందికి ఉద్యోగాలిచ్చిన  టీసీఎస్‌.. అందులో మెజారిటీ సిబ్బందిని అమెరికా కార్యాలయాల్లోనే నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది నాటికి 10 వేల మందికి ఉద్యోగాలిస్తామని ఇన్ఫోసిస్ హామీ
ఇక 2020 నాటికి అమెరికా మార్కెట్లో 10 వేల మందికి ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఇన్ఫోసిస్ గత ఏడాది వరకు 7,600 మందికి పైగా నియమించుకుంది. గత ఏడాది 13,514 మంది విప్రోలో చేరగా.. అందులో 9,000 మంది అలైట్‌ సోల్యూషన్స్‌లో పని చేసిన సిబ్బందే. గత ఏడాది సెప్టెంబర్ నెలలో అలైట్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌సీ నుంచి విప్రో 160 కోట్ల డాలర్ల విలువైన భారీ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టును దక్కించుకుంది.

టీసీఎస్ నుంచి విప్రో వరకు విలీన సంస్థల తాకిడి
టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లదీ అదే పరిస్థితి. వెరిజాన్‌ నుంచి ఇన్ఫోసిస్‌కు.. ట్రాన్‌అమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఫ్రుడెన్షియల్‌ పీఎల్‌సీల నుంచి టీసీఎస్‌కు మెగా కాంట్రాక్టులు దక్కాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా రెండు ఐటీ కంపెనీలు క్లయింట్ల సిబ్బందిని పెద్ద సంఖ్యలో చేర్చుకోవాల్సి వచ్చింది. ఒక్క ట్రాన్స్‌అమెరికా నుంచే 2,200 మంది టీసీఎస్‌లో చేరారు.

డ్రీమర్ల కోసం గొంతెత్తిన ఐటీ దిగ్గజ సంస్థలు
డొనాల్డ్‌ ట్రంప్‌ వలస విధానానికి వ్యతిరేకంగా అమెరికాలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు గొంతెత్తాయి. అక్రమంగా వలస వచ్చిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన ‘డ్రీమర్ల’ నివాస, పౌర హక్కులను పరిరక్షించాలని వందకు పైగా కంపెనీల సీఈఓలు, అమెరికా కాంగ్రెస్‌ సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై జనరల్‌ మోటార్స్‌, ఫేస్‌బుక్‌, కోకాకోలా, యాపిల్‌, అమెజాన్‌, గూగుల్‌, ఏటీ అండ్‌ టీ, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీల సీఈవోలు సంతకం చేశారు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారికి జన్మించిన సంతానాన్ని అమెరికాలో డ్రీమర్లు అని పిలుస్తారు. 

డ్రీమర్లు అమెరికాకు లభించిన గొప్పవరమని పేర్కొన్న దిగ్గజ సంస్థల సీఈఓలు
దిగ్గజ కంపెనీల సీఈఓలు వారిని అమెరికా ఆర్థిక రంగానికి లభించిన గొప్ప వరంగానూ, నిబద్ధ శ్రామిక శక్తులుగానూ, తమ లేఖలో వారు పేర్కొన్నారు. ‘వారు (డ్రీమర్లు) మన స్నేహితులు, ఇరుగుపొరుగువారు, సహ ఉద్యోగులు. తమ పౌరసత్వం విషయమై కోర్టుల్లో ఉన్న కేసులు తేలేవరకు వేచి చూడాల్సిన అగత్యం వారికి కలగకూడదు. పార్లమెంటే (కాంగ్రెస్‌) ఈ విషయంలో చొరవ తీసుకోవాలి’అని ఆ లేఖలో వారు కోరారు. న్యూయార్క్‌ టైమ్స్‌ సోమవారం ఈ లేఖను ప్రచురించింది.