ముంబై: ప్రపంచ వ్యాప్తంగా సమూల మార్పులు తీసుకొస్తున్న డిజిటల్‌ టెక్నాలజీతో ఉన్న ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీని వల్ల 2025 నాటికి 4.5 కోట్ల ఉద్యోగాల్లో మార్పు రావడం గానీ, పరివర్తన గానీ జరుగుతుందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో అంచనా వేసింది.

డిజిటల్ టెక్నాలజీ ప్రభావంతో 6.5 కోట్ల మందికి కొత్త కొలువులు
అదే సమయంలో డిజిటల్‌ టెక్నాలజీ ప్రభావంతో ఉత్పత్తి పెరిగి 6.5 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయంటోంది. భారతీయుల టెకీల నైపుణ్యంపై సాంకేతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖలు ఇదివరకే ఆందోళనలు వ్యక్తం చేశారు. భవిష్యత్‌ ఉద్యోగ అవసరాలకు వారి నైపుణ్యం పనికొస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సందేహాల మధ్య మెకిన్సే గ్లోబల్ నివేదికకు ప్రాధాన్యం
భారత ఉద్యోగుల్లోని నైపుణ్యంపై పలు దిగ్గజ కంపెనీలు సందేహాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వెలువడిన మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ఆయా టెక్నాలజీ టూల్స్‌పై శిక్షణ ఇచ్చి, కొత్త బాధ్యతలను నేర్పించడం ద్వారా దాదాపు 1-4.5 కోట్ల మంది ఉద్యోగులకు ముప్పు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని మెకిన్సే గ్లోబల్ నివేదిక పేర్కొంది.

జీడీపీలో డిజిటల్ వాటా రెట్టింపు ఇలా
ప్రధాన డిజిటల్‌ రంగాలైన ఐటీ/సాఫ్ట్‌వేర్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాలు జీడీపీలో తమ వాటాను 2025 కల్లా రెట్టింపు చేసుకుని 435 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది.

భారత్ సామర్థ్యానికనుగుణంగా రాణించేందుకు అన్ని వర్గాలు రియాక్ట్ కావాలి
భారత్‌ తనకున్న అసలు సామర్థ్యం మేర డిజిటల్‌ ప్రపంచంలో రాణించడానికి అన్ని వర్గాలు సమర్థంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని మెకిన్నే గ్లోబల్ తెలిపింది. కంపెనీలు సామర్థ్య పెంపునకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి డిజిటల్‌ ఇన్‌ఫ్రా, పబ్లిక్‌ డేటాలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. 

స్టార్టప్ సంస్థలకు అత్యంత సానుకూల వాతావరణం నెలకొల్పాలి
డిజిటల్‌ టెక్నాలజీ ఫలాలను అందుకోవడానికి స్టార్టప్‌ల ఏర్పాటును మరింత తేలిక చేయడంతోపాటు ఉద్యోగులకు కావలసిన శిక్షణను ఇచ్చేలా విధానాలు తీసుకురావాల్సి ఉంది. స్టార్టప్‌లకు అత్యంత సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మెకిన్సే గ్లోబల్ తెలిపింది.

సిబ్బంది పున:శిక్షణకు తగిన విధానాలు అమలు చేయాలి
దీంతోపాటు ప్రస్తుతం ఆయా సంస్థల్లో, రంగాల్లో పని చేస్తున్న సిబ్బందికి పునఃశిక్షణ కోసం తగిన విధానాలను ఏర్పాటు చేయాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ తమ పనితీరును ఎలా మారుస్తుందన్నదానిపై ఉద్యోగులు ఎల్లపుడూ ఒక కన్నేసి ఉంచుకోవాలి. అందుకు తగినట్లు తమ సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.

డిజిటల్ టెక్నాలజీతో 150 బిలియన్ల డాలర్ల లబ్ది
డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, రిటైల్‌ తదితర రంగంలో 150 బిలియన్‌ డాలర్ల మేర ప్రయోజనాలు అందుతాయని మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది. దేశీయ వ్యాపారాల్లో డిజిటైజేషన్‌ శరవేగంగా జరుగుతున్నా సమ వృద్ధి జరగడం లేదు. అన్ని రంగాల్లోనూ డిజిటైజేషన్‌ విషయంలో వెనకబడుతున్న వ్యాపారాలుండటం ఇందుకు కారణమని మెకిన్సే గ్లోబల్ విశ్లేషించింది.

ఎల్‌ అండ్‌ టీ నెక్ట్స్ పేరిట టెక్నాలజీ పై ఇలా ఫోకస్
లార్సెన్‌ అండ్‌ టర్బో (ఎల్‌ అండ్‌ టీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎల్‌ అండ్‌ టీ నెక్ట్స్‌ పేరుతో నవతరం టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), జియో స్పేషియల్‌ సొల్యూషన్స్‌, సైబర్‌ సెక్యూరిటీలపై దృష్టిసారిస్తున్నట్టు తెలిపింది. వ్యూహాత్మకంగా ఎల్‌ అండ్‌ టీ నెక్ట్స్‌ను ప్రకటించింది. ఇది సరికొత్త కోణం నుంచి సంస్థ భవిష్యత్‌ను పునర్‌నిర్వచిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇదీ ఎల్ అండ్ టీ ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళిక 
ఎల్‌ అండ్‌ టీ ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా దీన్ని ఎంచుకున్నట్టు తెలిపింది. ఐఓటీ, ఎనలిటిక్స్‌, ఐఓటీలను ఇండస్ర్టియల్‌ సెక్టార్‌లో అమలు చేసినట్టు పేర్కొంది. డిజిటలైజేషన్‌, ఎనలిటిక్స్‌ ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని లార్సన్‌ అండ్‌ టర్బో సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ తెలిపారు. 

ఫిజికల్ అండ్ డిజిటల్ మధ్య చెరిగిపోతున్న గీత
ఈ ఎల్‌ అండ్‌ టీ నెక్ట్స్‌ వ్యూహాత్మక కార్యక్రమం కోసం చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నామని లార్సన్‌ అండ్‌ టర్బో సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ చెప్పారు. ఫిజికల్‌, డిజిటల్‌ మధ్య ఉన్న గీత చెరిగిపోతోందని, ఇండస్ట్రీ 4.0 స్థాపితమవుతోందని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డిఫెన్స్‌ బిజినెస్‌) జేడీ పాటిల్‌ తెలిపారు.