బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ వచ్చేసింది. అమెరికాలోని గ్లోబల్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగింది. బెంగళూరులో ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌లోకి ఎంటరైంది. సెలెక్టెడ్ ప్రాంతాల్లో ఆన్ డిమాండ్ ఫుడ్‌‌ను డెలివరీ చేయడాన్ని పైలట్ బేసిస్‌‌లో అమెజాన్ ప్రారంభించింది. 
అమెజాన్ నౌ పోర్ట్‌‌ఫోలియోలో రెండు గంటల డెలివరీ సప్లయి చెయిన్‌‌ కోసం ఇప్పటికే కంపెనీ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. స్విగ్గీ, జొమాటోలు భారీగా డిస్కౌంట్లకు కోత పెట్టిన తరుణంలో, అమెజాన్ ఈ బిజినెస్‌‌లోకి ప్రవేశించడం గమనార్హం.

Also read:కరోనాతో ఎకానమీకి కష్టమే:డీఅండ్‌బీ.. తొలిసారి ‘నిర్మల’మ్మ పెదవిరుపు

కొరియన్‌‌, జపనీస్ వంటి వంటకాల్లో స్పెషలైజ్డ్ అయిన రెస్టారెంట్లతో భాగస్వామ్యమై, అమెజాన్ ఎక్స్‌‌క్లూజివ్ బ్రాండ్లను లాంచ్ చేయాలని చూస్తోంది. గ్రోసరీ, ఫుడ్ నుంచి ఎలక్ట్రానిక్స్, హోమ్ ప్రొడక్ట్‌‌ల వరకున్న ప్రొడక్ట్ పోర్ట్‌‌ ఫోలియోను పెద్ద మొత్తంలో విస్తరించాలనే ప్లాన్‌‌లో భాగంగా అమెజాన్ ఫుడ్ డెలివరీలోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ పెయిడ్ సబ్‌ స్క్రిప్షన్ సర్వీసెస్‌‌ పొందుతున్న కస్టమర్లకు ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. అయితే ఏ టైమ్‌‌లో వచ్చామనే విషయాన్ని అమెజాన్ పట్టించుకోదని, మార్కెట్‌‌లో లేట్‌‌గా ఎంటర్‌ అయినా గెలవడమే ధ్యేయమని కంపెనీకి చెందిన ఓ ఇన్వెస్టర్ చెప్పారు.

అన్ని లార్జ్ కేటగిరీలను క్యాప్చర్ చేయడమే కంపెనీ ఉద్దేశమని, టాప్ సిటీల్లోని కస్టమర్లకు అఫర్డబుల్‌‌గా సౌకర్యవంతమైన సేవలు అందించడానికి చూస్తోందని అమెజాన్ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ప్రస్తుతానికైతే, అమెజాన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ ఫామ్‌‌ను ఇద్దరు ఉద్యోగులతోనే ప్రారంభించింది. నగరంలోని హెచ్‌ఎస్‌‌ఆర్, బెలందూర్, హారలూర్, మారథహలి, వైట్‌ ఫీల్డ్ పిన్‌‌కోడ్‌‌లకు ఈ ప్రాజెక్ట్‌‌ పైలట్ రన్ అవుతోంది. 

ఇన్ఫోసిస్‌‌ నారాయణమూర్తి– కాట్‌ మెరాన్‌లతో కలిసి ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ పేరిట ఫుడ్ డెలివరీ రంగంలో అమెజాన్ అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ప్రియోన్ బిజినెస్ సర్వీసులతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న రెస్టారెంట్ల యజమానులు చెప్పారు.

ఈ కాంట్రాక్ట్స్‌తో 10 శాతం నుంచి 15 శాతం కమిషన్లతో అమెజాన్ తమ బ్రాండ్లను లిస్ట్ చేస్తుందని తెలిపారు. స్విగ్గీ, జొమాటో తమ పార్టనర్ రెస్టారెంట్లకు ఛార్జ్ చేస్తున్న దానిలో ఈ కమిషన్లు సగమే ఉన్నాయి. 

‘అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌ల లాంచ్‌‌ను మార్చిలో షెడ్యూల్ చేశాం. ఈ సర్వీసులు ప్రైమ్ నౌ యాప్‌‌లో లాంచ్ అవుతాయి’ అని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అమెజాన్ ప్రొడక్ట్ మేనేజ్‌‌మెంట్ డైరెక్టర్ రఘు లక్కప్రగడ లీడ్ చేస్తున్నారు. 

తమ కస్టమర్లకు సర్వ్ చేసేందుకు కొత్త ఏరియాలను, కొత్త అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూనే ఉంటామని అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు. ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌లను పెంచేందుకు లాజిస్టిక్స్, రెస్టారెంట్ ఎకోసిస్టమ్, టెక్నాలజీ, మార్కెటింగ్‌‌లో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.