Asianet News TeluguAsianet News Telugu

‘స్నాప్ డీల్’ శిఖలోకి షాప్‌క్లూస్: అదే జరిగితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ జోడీగా..

దేశీయ ఈ-కామర్స్ సంస్థల్లో ఒక్కటైన షాప్ క్లూస్‌ను టేకోవర్ చేసేందుకు స్నాప్ డీల్ చర్చలు జరుపుతోంది. దాదాపుగా స్నాప్ డీల్ లో షాప్ క్లూస్ విలీనం ఖరారైనట్లే. అయితే స్నాప్ డీల్ సంస్థలో షాప్ క్లూస్ వాటాదారులకు ఇచ్చే షేర్లు, వ్యవస్థాపకులకు నగదు చెల్లింపులపైనే చర్చ సాగుతోంది.

Snapdeal inches closer to acquiring ShopClues
Author
New Delhi, First Published May 23, 2019, 1:19 PM IST

న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థల్లో ఒకటైన షాప్ క్లూస్‌.. దాన్ని టేకోవర్‌ చేసేందుకు స్నాప్‌డీల్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ డీల్‌ విషయమై ఈ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డీల్‌ కుదిరితే దాని విలువ 200 నుంచి 250 మిలియన్‌ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా. 

స్నాప్ డీల్, షాప్ క్లూస్ సంస్థల మధ్య దాదాపు డీల్ ఖరారైనట్లే కనిపిస్తున్నది. అయితే పెట్టుబడుల పరంగా ఎంత అన్న అంశంపైనే ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సమాచారం. స్నాప్ డీల్ సంస్థలో షాప్ క్లూస్ విలీనమైతే ఉమ్మడి సంస్థలో ఆ సంస్థకు 10 శాతం వాటా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

షాప్ క్లూస్ ఇన్వెస్టర్లకు 9 షేర్లకు ఒక షేర్ కేటాయించే చాన్స్ ఉంది. షాప్ క్లూస్ యాజమాన్యం 30 శాతం వాటా అడుగుతోంది. అలాగే ప్రశాంతంగా వైదొలిగేందుకు షాప్ క్లూస్ సంస్థ ఫౌండర్లు రాధికా అగర్వాల్, సంజయ్ సేథీ కొంత క్యాష్ పేమెంట్ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. 

షాప్ క్లూస్ సంస్థలో ఇన్వెస్టర్లుగా ఉన్న సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ ‘జీఐసీ, హెలియన్ వెంచర్ పార్టనర్స్, టైగర్ గ్లోబల్, నెక్సస్ వెంచర్ పార్టనర్స్, యూనిలీటజర్ వెంచర్ వాటాలను కూడా స్నాప్ డీల్ 100 శాతం కొనుగోలు చేయాలని భావిస్తోంది. షాప్ క్లూస్ టేకోవర్ ప్రయత్నాలపై స్పందించేందుకు స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ కునాల్ బాహ్ల్ స్పందించలేదు. ఇటు షాప్ క్లూస్ ప్రతినిధి రెస్పాండ్ కాలేదు. 

ఇప్పుడు షాప్‌ క్లూస్‌ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న స్నాప్‌డీల్‌ గతంలో విపరీతమైన నష్టాల్లో కూరుకున్నది. ఆ సమయంలోనే స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ విఫల యత్నం చేసింది. ఆ డీల్‌కు తలొగ్గని స్నాప్‌డీల్‌ సొంత కాళ్లమీద నిలబడాలన్న ఆలోచనతో సంస్థ నష్టాలను తగ్గించడానికి ప్రణాళికా బద్దంగా అడుగులు వేసింది. 

స్నాప్ డీల్ సంస్థ యాజమాన్యం తీసుకున్న చర్యలు నష్టాల్ని భారీగా తగ్గించేందుకు దోహదం చేశాయి. ఇప్పుడు తన కార్యకలాపాలను విస్తరించేందుకు చూస్తున్న స్నాప్‌డీల్‌ తాజాగా క్లూస్‌ నెట్‌వర్క్‌ చేతిలో ఉన్న షాప్‌ క్లూస్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios