- మందగమనంలోనూ తగ్గని స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
- నిత్యావసర వస్తువుగా మారడమే కారణం
న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం ప్రభావం అప్పుడే మొదలైంది. వివిధ రంగాల్లో నియామకాలు, వేతనాల పెంపు, ఉద్యోగుల్లో కోతలు తదితర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిమాండ్‌లేక కొన్ని కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తుంటే.. మరికొన్ని ఉద్యోగులను, కార్మికులను ఇంటికి సాగనంపుతున్నాయి. బిస్కెట్ తయారీ సంస్థ పార్లేజీ మొదలు దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ వంటి దిగ్గజ కంపెనీలు సైతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
కానీ ఒక్క పరిశ్రమను మాత్రం గడ్డు పరిస్థితులు తాకడం లేదు. అదే మొబైల్, స్మార్ట్ ఫోన్ల మార్కెట్. ఆర్థిక మందగమనంలోనూ అమ్మకాలతో జోరుగా ముందుకు సాగుతోంది. వినియోగదారుల అవసరం, వాటిపై యూజర్లు పెంచుకున్న మోజుకు అద్ధం పడుతోంది.
దేశంలోని వివిధ రంగాల తయారీ కంపెనీలన్నీ దాదాపు అమ్మకాల్లో తగ్గుముఖంతో మొహం వేలాడేస్తున్నాయి. కానీ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ మాత్రం ముందుకు దూసుకెళుతోంది. గతం కంటే విక్రయాలను మరింత పెంచుకుంటూ టాప్ గేర్‌లో సాగుతోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు 10 శాతం పెరిగాయి. రానున్న పండగ సీజన్‌లో విక్రయాలు మరింత పెరుగుతాయని ఆయా కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ముందూ మొబైల్ ఫోన్ల విక్రయాల పెంపుపైనే కేంద్రీకరించాయి. తదనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం సమాచార మార్పిడి కోసం ఉద్దేశించిన ఓ సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు అదే సమస్త పనులు చేసి పెడుతోంది. మనిషి జీవితంలో అంతర్భాగమైపోయింది. మనిషి ప్రతి అవసరాలనూ తీర్చే నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకవేళ ఫోన్ పాడైపోతే.. మరో మార్గం లేకుండా తక్షణం మరో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని విక్రేతలు చెబుతున్నారు.
ఇటీవల విడుదలైన శామ్‌సంగ్ ప్రీమియం మోడల్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10+ ఫోన్లకు వచ్చిన డిమాండ్ చూస్తే.. ఎంతటి ఆర్థిక మాంద్యంలోనైనా ఈ పరిశ్రమపై ప్రభావం శూన్యమనే అభిప్రాయం వ్యక్తంకాక మానదు. గతంలో విడుదల చేసిన నోట్ 9 మోడల్‌తో పోలిస్తే ఈ సారి కొత్త మోడల్‌కు వచ్చిన రిజిస్ట్రేషన్లు రెండింతలయ్యాయని ఆ కంపెనీ ప్రతినిధులు చెబతుండడం ఇందుకు ఉదాహరణ.
జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో దేశీయంగా 36.9 మిలియన్ యూనిట్లు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు జరిగాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) పేర్కొంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 14.8శాతం అధికం కాగా.. గతేడాదితో పోలిస్తే 9.9శాతం ఎక్కువ అని తేలింది. కొత్తగా స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేవారి సంఖ్య పెరగడం అమ్మకాల పెరిగేందుకు మరో కారణం.
సాధారణ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పెరగడం మాట అటుంచితే.. ప్రీమియం ఫోన్ల మార్కెట్ దాన్ని మించి డబుల్ అమ్మకాలు నమోదు చేయడం విశేషం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే.. ఈ విభాగంలో రెట్టింపు అమ్మకాలు నమోదు చేసినట్లు ఐడీసీ డేటా చెబుతోంది. మరోవైపు ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్లను తెచ్చేందుకు అదే స్థాయిలో ఇతర కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు కేవలం ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితమైన షియోమీ, వన్‌ప్లస్ వంటి సంస్థలు ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 23, 2019, 10:44 AM IST