Asianet News Telugu

డిజిటల్ యుగంలో ఇండియాదే ‘కీ’ రోల్: సుందర్ పిచాయ్

భారత్ భారీ మార్కెట్‌ కావడం వల్లే ప్రయోగాలు చేసేందుకు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు బాగా తోడ్పాటునిస్తోందని, తరువాత ప్రపంచమంతటా తేవొచ్చునని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. గత 15 ఏళ్లలో భారత్‌ మార్కెట్‌లో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. తమ సంస్థ ప్రతి భారతీయుడ్ని చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. గోప్యతా విధానాల ప్రామాణీకరణ తప్పనిసరని తేల్చి చెప్పారు.  తాను క్రికెట్ ఫ్యాన్ అని చెప్పిన సుందర్ పిచాయ్.. ఫైనల్స్ టీమ్ ఇండియా, ఇంగ్లండ్ మధ్యే ఉండే అవకాశం ఉన్నదన్నారు.
 

Scale of Indian market allowing Google to develop new products: Pichai
Author
Washington, First Published Jun 14, 2019, 10:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం గూగుల్‌ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్‌ చాలా భారీ మార్కెట్‌ కావడంతో ఇక్కడ ప్రయోగాలు చేయటం గూగుల్‌కు సాధ్యమవుతోంది. 

తద్వారా భారత్‌లో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడమేకాక వాటిని ప్రపంచ మార్కెట్లలో ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్‌ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్‌’ సదస్సులో సుందర్‌ పిచాయ్‌ మాట్లాడారు.

పాలనను, సామాజిక.. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటోందని సుందర్ పిచాయ్ కితాబిచ్చారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషదాయకం అని అన్నారు.

‘భారత మార్కెట్‌ భారీ పరిమాణం వల్ల ముందుగా అక్కడ కొత్త ఉత్పత్తులు, సాధనాలు రూపొందించేందుకు, ఆ తర్వాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు మాకు వీలుంటోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లుగా ఈ ఆసక్తికర ట్రెండ్‌ నడుస్తోంది’ అని సుందర్ పిచాయ్ చెప్పారు.

‘ప్రస్తుతం భారత్‌ క్రమంగా డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లుతోంది. దీంతో చెల్లింపుల సాధనాలను ప్రవేశపెట్టడానికి భారత్‌ సరైన మార్కెట్‌ అని మేం భావించాం. ఇది నిజంగానే సత్ఫలితాలూ ఇచ్చింది. భారత మార్కెట్‌ కోసం రూపొందించిన సాధనాన్ని ప్రస్తుతం విదేశాల్లోనూ అందుబాటులోకి తేవడంపై మా టీం కసరత్తు చేస్తోంది‘ అని పిచాయ్‌ పేర్కొన్నారు. 

గత 15 ఏళ్లలో భారత మార్కెట్లో చాలా మార్పు వచ్చినట్టు సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. 2004లో దేశంలో మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్లను తయారు చేసే దేశీయ తయారీదారుల సంఖ్య రెండు వరకు మాత్రమే ఉండేదని, ఇప్పుడీ సంఖ్య 200 దాటిందన్నారు. 

మొబైల్‌ ఫోన్ల తయారీని చౌకగా మార్చడానికి తాము తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యేకించి ధరలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఫోన్లను కొనుగోలు చేసి వినియోగించే అవకాశం ఉంటుందని పిచాయ్‌ పేర్కొన్నారు.

ప్రత్యేకించి గూగుల్ ఉత్పత్తులు పటిష్టవంతమైన పునాది లాంటి పాత్రను పోషించాయని సుందర్ పిచాయ్ చెప్పారు. గూగుల్‌ తెచ్చిన చెల్లింపుల ఉత్పత్తి గురించి ప్రస్తావించారు. భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల దిశగా సాగుతున్న తరుణంలో భవిష్యత్‌ చెల్లింపులను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది సరైన మార్కెట్‌గా భావించామన్నారు. 

తమ పేమెంట్స్‌ ఉత్పత్తిని తమ కంపెనీ బృందం భారత్‌ నుంచి ప్రపంచ మార్కెట్‌కు తీసుకువస్తోందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ప్రయత్నాలకు అంకురార్పణ చేశామని, అది మెరుగైన ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. గూగుల్‌కు భారత్‌ ఒక అవకాశంగా మారిందని సుందర్ పిచాయ్ చెప్పారు. 

గత ఏడాదిలో గూగుల్‌ మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటిలో ఇంటర్నెట్‌ను మరింత ఎక్కువ మంది ఇండియన్లకు అందుబాటులోకి తేవడం, వారికి అవసరమయ్యే విధంగా గూగుల్‌ ఉత్పత్తులు రూపొందించడం, భారత్‌లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ప్రపంచ దేశాలకు అందించడం వంటివి ఉన్నాయి. ప్రతి భారతీయుడిని చేరుకోవాలన్న గూగుల్‌ లక్ష్యంలో భాగంగా ఇవి ఉన్నాయి. 

గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా మెజారిటీ మొబైల్‌ ఫోన్లు నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో గూగుల్‌ పే పేరుతో ఈ సంస్థ డిజిటల్‌ చెల్లింపుల సదుపాయాన్ని కల్పిస్తోంది.
 
డిజిటల్‌ వాణిజ్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలంటే గోప్యతా విధానాల ప్రామాణీకరణ తప్పనిసరి అని, దీనికి అమెరికా, భారత్‌ నేతృత్వం వహించగలవని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. డిజిటల్‌ వాణిజ్యానికి ఎలాంటి అవాంతరాలు లేని సమాచారం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ అందుతాయన్నారు. గోప్యత విషయంలో కస్టమర్లు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో వినియోగదారులు, కంపెనీలకు సంబంధించిన ప్రామాణీకరణ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత, ఓపెన్‌ ఇంటర్నెట్‌ విషయంలో భారత్‌, అమెరికా దేశాల భావాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు. స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను ఇరు దేశాలు పరిరక్షిస్తున్నాయన్నారు. 

డిజిటల్‌ వాణిజ్య లావాదేవీలకు సమాచార మార్పిడి స్వేచ్ఛగా జరగడం ప్రధానమని, అయితే అదే సమయంలో యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటం కూడా ముఖ్యమేనని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఈ సదస్సులో పిచాయ్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ పురస్కారాన్ని అందుకున్నారు.  

ఇదిలా ఉంటే ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత్, ఇంగ్లండ్‌ తలపడే అవకాశాలు ఉన్నాయని సుందర్ పిచాయ్‌ జోస్యం చెప్పారు. భారత జట్టు గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ‘భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఫైనల్‌ పోరు ఉండొచ్చనుకుంటున్నాను. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా మంచి పటిష్టమైన జట్లే. వాటినీ తక్కువగా అంచనా వేయలేం’ అన్నారాయన.

క్రీడల్లో తనకు క్రికెట్‌ అంటే మక్కువని తెలిపిన పిచాయ్‌ తేల్చేశారు. అమెరికాలో తన క్రికెట్, బేస్‌బాల్‌ ఆటల అనుభవాలు వెల్లడించారు. ‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో బేస్‌బాల్‌ ఆడేందుకు యత్నించా. అది కాస్త కష్టమైన ఆటే. మొదటి గేమ్‌లో బాల్‌ను గట్టిగా కొట్టా. క్రికెట్‌లో అలా చేస్తే గొప్ప షాట్‌ కాబట్టి.. గొప్పగానే ఆడాననుకున్నా. అందరూ వింతగా చూశారు. అలాగే క్రికెట్‌లో రన్‌ తీసేటప్పుడు బ్యాట్‌ను వెంట పెట్టుకుని పరుగెత్తాలి. ఇందు లోనూ అలాగే చేశాను.. కానీ తర్వాత తెలిసింది.. బేస్‌బాల్‌ అనేది క్రికెట్‌ లాంటిది కాదని. ఏదైతేనేం.. నేను క్రికెట్‌కే కట్టుబడి ఉంటా’ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios