న్యూయార్క్: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్స్ మేజర్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి తీసుకు రానున్నది. అమెరికా టెలికాం సంస్థ వెరిజోన్‌తో కలిసి శాంసంగ్‌ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని అమెరికాలోని హవాయ్‌లో జరిగిన వార్షిక క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ టెక్నాలజీ సదస్సులో వెరిజోన్‌ ఉపాధ్యక్షుడు బ్రియాన్ హిగ్గిన్ తెలిపారు.

‘మొబైల్‌ డేటా అనుసంధానంలో 5జీ సంచలనం సృష్టించనున్నది. ఊహించని రీతిలో అనుభూతులు పంచనున్నది. శాంసంగ్‌, వెరిజోన్‌ కలిసి 2019 ఏడాది ప్రథమార్ధంలో కొన్ని నగరాల్లో 5జీని అందుబాటులోకి తేనున్నాయి. శక్తిమంతమైన 5జీ సేవలను వినియోగదారుల చేతిలోకి తేవడానికి మేం ప్రస్తుతం కృషి చేస్తున్నాం’ అని వెరిజోన్ ఉపాధ్యక్షుడు బ్రియాన్‌ హిగ్గిన్స్‌ చెప్పారు. 

వినియోగదారుల అంతర్జాల అవసరాలను సమూలంగా మార్చే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడంలో వెరిజోన్, క్వాల్ కామ్ టెక్నాలజీస్ సంస్థలతో భాగస్వాములైనందుకు గర్వంగా ఉందని శాంసంగ్‌ మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు జస్టిన్‌ డేనిసన్‌ అన్నారు. హవాయిలోని మౌయిలో జరిగిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ టెక్నాలజీ సదస్సులో శామ్‌సంగ్, వెరిజోన్ తాము మార్కెట్లోకి విడుదల చేయనున్న 5జీ స్మార్ట్ ఫోన్ వివరాలను ఆవిష్కరించనున్నాయి.

5జీ నెట్‌వర్క్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ కన్నా కొన్ని రెట్ల వేగంతో మొబైల్‌లో అంతర్జాల సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో డౌన్‌లోడ్‌ వేగం విపరీతంగా పెరగనున్నది. తమ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను 2019 మొదట్లో శాంసంగ్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.