బ్రాడ్ బాండ్, ఫైబర్ నెట్‌వర్క్ తమ పట్టు పెంచుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. హాథ్ వే అండ్ డాటా కామ్ సంస్థలో అదనంగా 26 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్ధమని ప్రకటించాయి. 

జియో కంటెంట్, జియో ఇంటర్నెట్ ఇలా ఆఫర్
జియో కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, జియో ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్స్‌లతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు సంస్థలు.. హాథ్ వే అండ్ డాటా కాం సంస్థ నుంచి 46,02,27,170 పూర్తి ఈక్విటీ సేర్లను ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యాయి. ఇది హాథ్ వే సంస్థ షేర్లలో 26 శాతం.

హాథ్ వే 26 శాతం షేర్ల విలువ రూ.1,488 కోట్లు
ఒక్కో షేర్ విలువ రూ.32.35 చొప్పున మొత్తం హాథ్ 26 శాతం షేర్ల విలువ రూ.1,488.83 కోట్లను నగదు రూపంలో చెల్లించడానికి రిలయన్స్ గ్రూప్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని బీఎస్ఈ ఫైలింగ్‌లో హాథ్ వే తెలిపింది. గతేడాది అక్టోబర్ నెలలోనే డెన్ నెట్ వర్క్స్ లిమిటెడ్, హాథ్ వే కేబుల్ అండ్ డేటా కాం సంస్థల్లో రూ.5,230 కోట్ల విలువైన మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించాయి.

డెన్‌లో రిలయన్స్ ప్రాథమిక పెట్టుబడి రూ.2,045 కోట్లు
డెన్ సంస్లలో రిలయన్స్ గ్రూపు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2,045 కోట్లను పెట్టనున్నట్లు ప్రకటించింది. దీన్ని ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా సమకూర్చనున్నది. ఇక సెకండరీ పర్చేజ్ రూపంలో ప్రమోటర్లు రూ.245 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తారు.  

హాథ్ వేలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రిలయన్స్ రూ.2,940 కోట్ల షేర్ల కొనుగోలు
ఇక హాథ్ వే సంస్థలో రిలయన్స్ ప్రాథమికంగా రూ.2,940 కోట్ల పెట్టుబడులను ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కొనుగోలు చేయనున్నది. ఈ రెండు ఆఫర్లకు రిలయన్స్ సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి ఆమోదం లభించింది. 

జియో విజయంతో ముకేశ్ అంబానీ ఇలా..
రిలయన్స్ జియో అందించిన విజయంతో ముకేశ్ అంబానీ గత అక్టోబర్ నెలలో జరిగిన సంస్థ గ్రూప్ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఇక ముందు జియో ఇన్ఫో ఫైబర్ బ్రాండ్ లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాథ్ వే అండ్ డాటా కాం, డెన్ నెట్ వర్క్ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా బ్రాడ్ బాండ్ మార్కెట్‌లోనూ రిలయన్స్ విస్తరించనున్నది. 

ఎఫిసియెంట్ రిటైలింగ్‌ దిగ్గజం ‘రిలయన్స్‌ రిటైల్‌’
ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ మరో ఘనత సాధించింది.  అంతర్జాతీయంగా శక్తిమంత రిటైల్‌ దిగ్గజాలతో డెలాయిట్‌ రూపొందించిన ‘గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2019’ జాబితాలో ఒకేసారి 95 స్థానాలు పైకి చేరి, 94వ స్థానం పొందింది. రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లలో విక్రయించే నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, ఫ్యాషన్‌, జీవనశైలి ఉత్పత్తుల విభాగాలన్నింటిలో వృద్ధి బాగుందని డెలాయిట్‌ తెలిపింది. విక్రయశాలల విస్తరణతో పాటు, విక్రయాల్లో వృద్ధి బాగుందని వివరించింది.

రిటైల్ దిగ్గజాలపై డెలాయిట్ ఇలా నివేదిక రూపకల్పన
డెలాయిట్‌ సంస్థ ఏటా రూపొందించే ఈ నివేదిక కోసం అంతర్జాతీయంగా 250 సంస్థలను ఎంపిక చేసుకుంటుంది. 2017 ఆర్థిక సంవత్సర ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని, తాజా జాబితా రూపొందించింది. భారత సంస్థలకు వచ్చేసరికి 2018 మార్చి ఆఖరు వరకు ఆదాయాలను సమీకరించింది. ఈ జాబితాలోని సంస్థల ఆదాయం 4.51 లక్షల కోట్ల డాలర్లు (రూ.321.63 లక్షల కోట్లకు పైగా) అని డెలాయిట్‌ తెలిపింది. 

10 సంస్థల ఆదాయం వాటా 3.16 శాతం
ఈ మొత్తంలో తొలి 10 రిటైల్‌ సంస్థల ఆదాయ వాటాయే 31.6 శాతం. ఇందులో 7 అమెరికా సంస్థలు కాగా, జర్మనీ సంస్థలు స్వ్కార్జ్‌, ఆల్ది ఎన్‌కాఫ్‌ 5, 9 స్థానాల్లో నిలిచాయి. బ్రిటన్‌ సంస్థ టెస్కో స్థానం మెరుగుపడి 10కి చేరింది. అయితే జాబితా మొత్తంలో ఐరోపాకు చెందినవే 87 కంపెనీలు ఉన్నాయి. 

ప్రపంచంలోనే మేటి వాల్‌మార్ట్
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్థగా వాల్‌మార్ట్‌ తన స్థానం నిలుపుకుంది. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడంతోపాటు జపాన్‌లో రకుతెన్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఇక రెండోస్థానంలో కాస్ట్‌కో, మూడోస్థానంలో క్రోగర్‌ నిలిచాయి. అమెజాన్‌ స్థానం 2 స్థానాలు మెరుగుపడి 4వ స్థానానికి చేరింది. ఈ సంస్థ ఆదాయం 25.3 శాతం వృద్ధి చెందింది.