Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఆలీబాబా ‘రిలయన్స్ ఈ-కామర్స్’

జియోను మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి భారతీయ టెలికం రంగాన్నే కుదేలు చేసిన బిలియనీర్ ముకేశ్‌ అంబానీ.. తాజాగా మరో సంచలనానికి నాంది పలుకనున్నారు. రిలయన్స్ రిటైల్‌, జియో సంయుక్త భాగస్వామ్యంతో ఈ- కామర్స్‌ బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ముకేశ్‌ అంబానీ బృందం వ్యూహాలు రచిస్తోంది. 

Reliance Jio to foray into e-commerce business to rival Amazon and Flipkart
Author
Hyderabad, First Published Jan 25, 2019, 2:17 PM IST

అమెరికా కార్పొరేట్ దిగ్గజాలు వాల్‌మార్ట్- అమెజాన్ మధ్య మొదలైన వాణిజ్య యుద్ధంలో త్రిముఖ పోటీకి రంగం సిద్ధం అవుతున్నది. భారత్లోనే అతి పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని ‘రిలయన్స్ ఈ-కామర్స్’రాకతో ఈ కామర్స్ మార్కెట్లో పోటీ మరింత తీవ్రం కానున్నది. ఈ విషయమై యూబీఎస్ అనే అధ్యయన సంస్థ పేర్కొన్నది.

ఇప్పటికే ఈ పోరుకు సిద్ధమయ్యేలా దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది చిరు వ్యాపారులను వినియోగదారులకు అనుసంధానించేలా ముఖేష్ బృందం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలుత గుజరాత్లో 12లక్షల మంది చిరువ్యాపారులను అనుసంధానిస్తారు. తొలి దశలో దేశంలోని దాదాపు 10వేల రిలయన్స్ రిటైల్ స్టోర్లతో వ్యాపారులను అనుసంధానిస్తారు. 

సదరు 10 వేల రిలయన్స్ రిటైల్ స్టోర్లతో అనుసంధానమైన వ్యాపారులకు కామన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వ్యవస్థను సమకూర్చనున్నారు. దీంతోపాటు సరళంగా ఉండేలా చెల్లింపు టెర్మినళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది ఈ కామర్స్ దిగ్గజాలకు నేరుగా పోటీ ఇస్తుంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ మొత్తం 6,500 గ్రామాలకు విస్తరించింది. దీనికి 50 గోడౌన్లు కూడా ఉన్నాయి. దీంతో పంపిణీ వ్యవస్థను మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉంది.

భారత్ దేశంలోని మొత్తం 500 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారుల్లో 200 మిలియన్లు గ్రామీణులే. వీరిలో చాలా మంది నెలకు ఒకసారి మాత్రమే ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చౌకైన 4జీ సేవలతో జియో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుకెళ్లింది.

ఈ నేపథ్యంలో పల్లెలు, చిన్న పట్టణాల్లోని దుకాణాలు కూడా హైబ్రీడ్ ఆఫ్ లైన్ ఆన్లైన్ మోడళ్ల వినియోగదారులతో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఏర్పడింది. ఆన్లైన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాదిలోనే 120 మిలియన్లను దాటవచ్చని అంచనా.

ఇప్పటికే భారత్లో జియో వినియోగదారులు దాదాపు నెలకు 500 కోట్ల గంటల వీడియోలను వీక్షిస్తున్నారు. దీంతో రిలయన్స్కు ఏజియో పేరిట ఉన్న ఫ్యాషన్ ఉత్పత్తుల ప్రచారానికి ఇది అద్భుతమైన వేదికగా ఉపయోగపడనుంది. 

రిలయన్స్ ఈ మార్కెట్లో అడుగుపెట్టడానికి గుజరాత్ రాష్ట్రాన్ని వేదిక ఎంచుకోవడానికి కారణం ఉంది. ఇటీవలే గుజరాత్‌ వైబ్రంత్‌ సమ్మిట్‌ లో తమ కర్మభూమి గుజరాత్‌ అని ముకేశ్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్రంలో భారీ సంఖ్యలో వ్యాపారులు ఉన్నారు. దీంతో రిలయన్స్ కొత్త వేదికపైకి తగినంత మంది చిరు వ్యాపారులు రావడానికి అవకాశం లభిస్తుంది.


ఇప్పటికే రిలయన్స్ జియోకు దేశవ్యాప్తంగా 4,000 శాఖలు ఉన్నాయి. వీటి సంఖ్యను 10,000కు పెంచనుంది. జియోకు 280 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. వీరిలో సింహభాగాన్ని ఈకామర్స్ వినియోగదారులుగా మార్చుకున్నా, కొత్త వ్యాపారానికి తిరుగుండదు. 

‘నూతన తరంలో సమాచారమే ఇంధనం’ అని ముకేశ్‌ అంబానీ వ్యాఖ్యానించడం వెనుక అసలు రహస్యం ఇదే. అత్యాధునిక సాంకేతికతను రిలయన్స్ ఈకామర్స్ వ్యాపారంలో ఉపయోగించుకొంటుందని గత మార్చిలో ముఖేష్ అంబానీ తెలిపారు.

దీనిలో భాగంగా అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రాఫ్స్‌ను ఉపయోగించుకొని వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని ముఖేష్ అంబానీ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తేనున్న కొత్త ఈకామర్స్ పాలసీ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి ఆన్లైన్ రిటైల్ దిగ్గజాలు తమకు వాటాలు ఉన్న కంపెనీల్లో వస్తువులను ఎక్స్‌క్లూజివ్ పేరుతో విక్రయించడానికి వీల్లేదు. ఈ నిబంధనలు అమెజాన్‌కు, వాల్మార్ట్‌కు ఇబ్బందులను సృష్టించవచ్చు. 

రిలయన్స్‌కు ఈ నిబంధనలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్ చేయడంపై పట్టుదలతో ఉంది. నగదు రహిత భారత దేశాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోంది. ఇదే సమయంలో ఈ కామర్స్ రంగంలోకి అడుపెట్టడం రిలయన్స్‌కు కలిసి రానుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios