ముంబై: రిలయన్స్ జియో విజయంతో దూసుకెళ్తున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. తదుపరి ఫిన్ టెక్, పీఓఎస్ బిజినెస్ వైపు ద్రుష్టి మళ్లించారు. ఇప్పటికే 200 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్ల పునాది కలిగి ఉన్నది. తాజాగా మర్చంట్ కమ్యూనిటీకి చెందిన పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) విభాగం వైపు ద్రుష్టి మళ్లించారు. 

ఇప్పటికే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల పరిధిలో పైలట్ ప్రాతిపదికన పీఓఎస్ సర్వీసులను రిలయన్స్ జియో నిర్వహిస్తోంది. మర్చంట్లు, రిటైల్ ప్రొవిజన్ స్టోర్ల యజమానులు రిలయన్స్ జియో‘పీఓఎస్’ డివైజ్ పొందాలంటే రూ.3000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై జీరో డిస్కౌంట్ రేటుపై రూ.2000 వరకు ఆన్ లైన్ లావాదేవీలు జరుపొచ్చు. మర్చంట్లు, రిటైల్ ప్రొవిజన్ స్టోర్ల యజమానులు ఎప్పటికప్పుడు తాము చేసిన లావాదేవీల మేరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం రిలయన్స్ సొంత వాలెట్ ‘జియో మనీ’, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ‘భీమ్’ యాప్ ద్వారా లావాదేవీలు జరుపొచ్చు. త్వరలో మిగతా యాప్ లు, ఆన్ లైన్ పేమెంట్ సంస్థల ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతున్నారు. 

ఈ మేరకు రిలయన్స్ జియో, హిందూస్థాన్ యూనీ లీవర్ (హెచ్‌యూఎల్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. సమీప భవిష్యత్‌లో ‘ఈ-కామర్స్’బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు రిలయన్స్ జియో ‘పీఓఎస్’ రంగం సిద్ధం చేసుకుంటున్నది. 

కేవలం ఫిన్ టెక్ కంపెనీలు మాత్రమే కాక.. అగ్రశ్రేణి బ్యాంకుల లావాదేవీల్లో పట్టు సాధించాలన్నది రిలయన్స్ జియో లక్ష్యం. ప్రస్తుతం ‘పీఓఎస్’ మార్కెట్‌లో బ్యాంకుల వాటా 70 శాతం. రిలయన్స్ జియో ప్రభావం ఎంఎస్ వైప్, ఎజెటాప్, పైన్ లాబ్స్, ఇన్నోవిటీ, ఫోన్ పె తదితర పేమెంట్ సంస్థల లావాదేవీలపైనా పడనున్నది. 

ఎంఎస్ వైప్ వ్యవస్థాపకుడు, సీఈఓ మనీశ్ పటేల్ మాట్లాడుతూ జియో పీఓఎస్ సర్వీసుల్లోకి అడుగు పెట్టడం కీలక పరిణామమేనన్నారు. కిరాణా స్టోర్లు, రిటైల్ మర్చంట్స్ ప్రొవిజన్ స్టోర్లలో జియో సర్వీసులు ప్రారంభమయ్యాయి. సుమారు 300 మిలియన్ల స్మార్ట్ ఫోన్ యూజర్లు దేశంలో ఉన్నారు. కార్డు యూజర్లు 100 కోట్ల మందికి చేరుకున్నారు. ఆర్బీఐ ప్రకారం గత అక్టోబర్ నాటికి 42.68 మిలియన్ల క్రెడిట్ కార్డులు, 998.61 డెబిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. 

2024 నాటికి భారత ‘పీఓఎస్’ మార్కెట్’ మూడు బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని గ్లోబల్ మార్కెట్ ఇన్ సైట్స్ పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంతో ఈ- కామర్స్ బిజినెస్‌ను పెంపొందించడమే లక్ష్యం. మున్ముందు రిలయన్స్ జియో.. ఆర్థిక సేవల విభాగంలో అతిపెద్ద పాత్ర పోషించనున్నదని ముంబై కేంద్రంగా పని చేస్తున్న ప్రైవేట్ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే రిలయన్స్ జియోతో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఒప్పందం కూడా చేసుకున్నది.