ముంబై: దేశీయ టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్‌ జియో వచ్చే ఏడాది మరో సంచలనం నెలకొల్పేందుకు సిద్ధం అవుతున్నది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ వచ్చే ఏడాదికల్లా ఐపీవోకు రావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దఫాలుగా వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. 

2020 ఏడాది అర్థభాగం నాటికి జియోను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోందని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. ఇందుకోసం బ్యాంక్లు, కన్సల్టెంట్లతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పలు సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నది. 

దీంతో ఐపీవో ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని రిలయన్స్ ఇన్ఫోకామ్ తెలిపింది. ప్రస్తుత 4జి నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాక, 5జీ స్పెక్ట్రం కొనుగోలు చేయడంతోపాటు తన మౌలిక సదుపాయాలను తదుపరి తరం ఇంటర్నెట్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయడం కూడా  పెద్ద సవాల్‌ అని రిలయన్స్ ఇన్ఫోకామ్ వ్యాఖ్యానించింది.

వినియోగదారులపరంగా, సేవలపరంగా టాప్‌ బ్రాండ్‌గా నిలిచిన రిలయన్స్ జియో మార్చి త్రైమాసికంలో లాభాలను నివేదించిన ఏకైక టెల్కోగా నిలిచింది.  2019 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 840 కోట్ల స్వతంత్ర లాభాన్ని నమోదు చేసింది. నికర లాభం 64.7 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ. 510 కోట్ల లాభాలు నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ .2,964 కోట్లు అని రిలయన్స్ జియో తెలిపింది. గత సంవత్సరం పోలిస్తే ఆదాయం 65శాతం పెరిగింది. 

కాగా జియో ఐపీవో వార్తలు గతంలో కూడా మార్కెట్‌ వర్గాల్లో హల్‌ చల్‌ చేశాయి. అయతే ఈ  వార్తలను జియో కొట్టిపారేసింది. తాజా అంచనాలపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే సంస్థ ఆధ్వర్యంలోని టవర్, ఫైబర్ అసెట్స్ అనుబంధ మౌలిక వసతుల ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లోకి నిదుల సమీకరణే తమ తొలి ప్రాధాన్యం అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వర్గాలు అంటున్నాయి.

‘ఫైబర్ టు హోమ్ (ఎఫ్‌టీటీహెచ్) నెట్‌వర్క్‌ను ఆవిష్కరించడంతోపాటు మరింత ఆదాయాన్ని సముపార్జించే లక్ష్యంతో ఐపీవోకు వెళుతున్నామని జియో ఇన్ఫోకామ్ వర్గాల కథనం. యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (అర్పు) పెంచడం కూడా ఐపీవో విడుదల లక్ష్యంగా ఉంది. రిలయన్స్ జియో ‘అర్పు’ వరుసగా ఐదో నెల రూ.131.7 నుంచి రూ.126.2లకు పడిపోయింది. అఫ్ కోర్స్ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ గరిష్ఠ టారిప్ ప్లాన్లను కొనసాగిస్తుండటంతో వాటి అర్పు ఇంకా తక్కువగా నమోదైంది. 

రిలయన్స్ టవర్, ఫైబర్ ఆపరేషన్స్ విడగొట్టిన తర్వాత టవర్ బిజినెస్ రూ.36 వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నది. రెండు సంస్థల మధ్య రూ.1.07 లక్షల కోట్లను విభజించడంతో రిలయన్స్ జియో నికర రుణం రూ.67 వేల కోట్లకు పరిమితమైంది. రిలయన్స్ ఇన్ఫ్రా ట్రస్టుల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు సదరు సంస్థ మైలిస్, సిటీ, ఐసీఐసీఐసీ సెక్యూరిటీస్ లను నియమించింది. అయితే మూడు సంస్థల ప్రతినిధులు కూడా ప్రతిస్పందించలేదు.