బార్సిలోనా: భారత్‌లో ప్రస్తుతం ఉన్న టెలికాం నిబంధనలు అసమానంగా ఉన్నాయని ప్రముఖ టెలికం సంస్థ వొడా ఫోన్‌ సీఈవో నిక్‌రీడ్‌ ఆరోపించారు. భారత్‌లో టెలికాం నిబంధనలు ఒకే విధంగా లేవంటూ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వద్ద ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ''మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి.. కానీ గత రెండేళ్లలో వచ్చిన కొత్త నిబంధనలు అన్నీ ఒక్క రిలయన్స్‌ జియో సంస్థకు తప్ప చాలా వరకు మార్కెట్లో ఉన్న సంస్థలకు వ్యతిరేకంగానే ఉన్నాయి’ అని ఆరోపించారు. 

ట్రాయ్ నిబంధనలు రిలయన్స్ జియో పట్ల మాత్రమే అనుకూలంగా ఉన్న సంగతిని తాము కచ్చితంగా చెప్పగలమని వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ పేర్కొన్నారు. నిబంధనలు అన్ని సంస్థలకు ఒకటేలా ఉండాలని తాను కోరుతున్నానని అన్నారు. భారతీయ నియంత్రణ, విధానాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం తమ సంస్థ కష్టకాలంలో ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న అతి తక్కువ మొబైల్‌ సర్వీసు రేట్లు ఏమాత్రం గిట్టుబాటుకావని వొడాఫోన్ సీఈఓ నిక్‌ రీడ్ పేర్కొన్నారు. మార్కెట్లోని ప్రధాన మూడు టెలికం సంస్థలు నగదు కొరతతో ఇబ్బంది పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారత్‌లో ధరలు చాలా తక్కువ ఉన్నాయని వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ తెలిపారు. భారత్‌లో నెలకు సగటున ఒక్క వాడకందారు డేటా వినియోగం 12 జీబీలుగా ఉందని పేర్కొన్నారు. ఇంత తక్కువ ధరలను ప్రపంచంలో ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ ధరలు పెరగాల్సిన అవసరం ఉందని, అలాగని ఒక్కసారిగా టెలికాం ధరలు చుక్కల్ని తాకాలని కాదని అన్నారు.

మధ్యస్థంగా ధరలు పెరిగినా సంస్థలకు కాస్త ఉపయుక్తంగా ఉంటుందని వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ అభిప్రాయపడ్డారు. టెలికం సంచలనంగా మార్కెట్లోకి దూసుకువచ్చిన జియోతో దేశీయంగా టెలికాం మార్కెట్లో తీవ్ర టారీఫ్‌ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. 

ఉచిత కాల్‌సర్వీసలతో పాటు అతితక్కువ ధరకు ఇంటర్‌నెట్‌ అందిస్తామంటూ జియో చేసిన ప్రకటన దేశీయంగా సంచలనం సృష్టించింది. దీనికి తోడు కేవలం అనతి కాలంలోనే అత్యధికులు జియో కనెక్షన్లు తీసుకునేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని జియో.. ఈ ఏడాది దేశంలోనే అగ్రశ్రేణి టెలికాం కంపెనీగా అవతరించనుందని బ్రోకరేజీ సంస్థలు బెర్న్‌స్టెయిన్‌, క్రెడిట్‌ స్విస్‌ తెలిపాయి. సబ్‌స్ర్కైబర్‌ బేస్‌, రెవెన్యూల్లో జియో అగ్రశ్రేణి సంస్థగా నిలవనున్నదని ఈ సంస్థలు వేర్వేరుగా విడుదల చేసిన నివేదికల్లో తెలిపాయి. 

2016లో ఉచిత ఫోన్‌ కాల్స్‌, చౌక డేటాతో మార్కెట్లోకి వచ్చిన జియో రోజురోజుకు సంచలనం సృష్టిస్తూ ముందుకు సాగుతోందని బ్రోకరేజీ సంస్థలు బెర్న్‌స్టెయిన్‌, క్రెడిట్‌ స్విస్‌ పేర్కొన్నాయి. నాన్‌ స్టాండర్డ్‌ డిప్రిసియేషన్‌ మెట్రిక్స్‌, సబ్సిడీల ద్వారా బండిల్డ్‌ ఆఫర్లతో జియో ఫోన్లను విక్రయించటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్ల నష్టం రావచ్చని అంచనా వేస్తున్నట్లు బెర్న్‌స్టెయిన్‌ తెలిపింది.