Asianet News TeluguAsianet News Telugu

ప్లీజ్! జియోకు స్పెక్ట్రం సేల్ అనుమతించండి: ఆర్-కామ్

జియోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ సంస్థకు స్పెక్ట్రం విక్రయించేందుకు అనుమతించాలని టెలికం శాఖను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) ప్రతినిధులు కోరారు. జియో కమ్యూనికేషన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో స్పెక్ట్రం విక్రయానికి డాట్ నిరాకరించింది. ఈ క్రమంలో ఆర్ కాం, రిలయన్స్ జియో ప్రతినిధులు టెలికం శాఖ (డాట్) అధికారులను కలిసి ఒప్పందం ఆమోదానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

RCom urges DoT to grant approval for spectrum deal
Author
New Delhi, First Published Dec 21, 2018, 9:35 AM IST

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియోతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా స్పెక్ట్రం విక్రయించేందుకు అనుమతించాలని టెలికం శాఖ (డాట్)ను రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్-కామ్) అభ్యర్థించింది. రిలయన్స్ జియోతో కుదిరిన ఒప్పందాన్ని ఆమోదించబోమని డాట్చెప్పటంతో ఆర్‌-కామ్  పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.

జియో డీల్‌కు అనుమతి రాకపోవటంతో ఆర్‌కామ్‌ గురువారం.. టెలికాం శాఖను ఆశ్రయించింది. రుణాల చెల్లింపునకు ఆర్‌-కామ్‌ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిందని, దీనికి అనుగుణంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)ను మంజూరు చేయాలని టెలికాం శాఖను కోరింది. 

రెండు కంపెనీల మధ్య స్పెక్ట్రమ్‌ డీల్‌లో చెల్లింపులకు ‘డాట్‌’ లేవనెత్తిన అభ్యంతరాలపై టెలికాం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్‌తో చర్చించినట్లు ఆర్‌కామ్‌, రిలయన్స్‌ జియో సంస్థల ఉన్నతాధికారులు తెలిపారు. కాగా తుది తీర్పునకు లోబడి చెల్లించాల్సిన మొత్తాలను పూర్తిగా చెల్లించేందుకు కట్టుబడి ఉన్నట్లు అనిల్‌ అంబానీ సారథ్యంలోని ఆర్‌కామ్‌ ప్రకటించింది. 

అంతేకాక టెలికాం శాఖ డిమాండ్‌ చేసిన విధంగా టెలికాం ట్రిబ్యునల్‌, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్‌ గ్యారంటీలను ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే అనుబంధ సంస్థ రిలయన్స్‌ రియల్టీ.. నాన్‌ డిస్పోజల్‌ అండర్‌టేకింగ్‌, కార్పొరేట్‌ గ్యారంటీని అందించనుందని తెలిపింది.
 
మరోవైపు బకాయిల చెల్లింపు, అనుబంధ చార్జీల చెల్లింపుపై స్పష్టత వచ్చేంత వరకు ఆర్‌కామ్‌- ఆర్‌జియో డీల్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని డాట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఆర్‌-కామ్‌ బకాయిలకు తాము ఎలాంటి బాధ్యత తీసుకోలేమని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే జియో - ఆర్-కాం మధ్య కుదిరిన స్పెక్ట్రం డీల్‌కు టెలికాం శాఖ నో చెప్పింది. ఆర్‌కామ్‌ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని కొంత గడువు ఇవ్వాలని సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా ఎరిక్సన్‌ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను కూడా వచ్చే ఏడాది జనవరి 22వ తేదీకి వాయిదా వేస్తూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశాలు జారీ చేసింది.

స్పెక్ట్రమ్‌ డీల్‌కు డాట్‌ అనుమతిస్తుందన్న అంచనాతో అనుబంధ సంస్థ రిలయన్స్‌ రియల్టీ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌ఎల్‌).. టెలికాం శాఖకు రూ.1,400 కోట్ల కార్పొరేట్‌ గ్యారంటీని ఇచ్చింది. ప్రస్తుతం ఆర్‌కామ్‌ రుణ భారం రూ.46,000 కోట్లుంది. జియోకు స్పెక్ట్రమ్‌ను విక్రయించి రూ.25,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని భావించింది.
 
స్పెక్ట్రమ్‌ డీల్‌కు టెలికాం శాఖ ఆమోదించకపోవటంతో ఆర్‌కామ్‌పై మరోసారి కోర్టును ఆశ్రయించాలని ఎరిక్సన్‌ యోచిస్తోంది. అక్టోబర్ నెల 23వ తేదీన సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు ఆర్‌కామ్‌ కట్టుబడి ఉండకపోవటంతో కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు ఎరిక్సన్‌ తరపు న్యాయవాది తెలిపారు. 

ఆర్‌కామ్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సుప్రీం కోరటంతో తాము ఆ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టామని, తాజాగా డాట్‌..డీ ల్‌కు నో చెప్పటంతో మరోసారి పిటిషన్‌ను దాఖలు చేయాలని చూస్తున్నట్లు ఎరిక్సన్ న్యాయవాది తెలిపారు. స్వీడన్‌కు చెందిన టెలికాం గేర్‌ కంపెనీ ఎరిక్సన్‌కు ఆర్‌కామ్‌ రూ.550 కోట్లు బకాయి పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios