ముంబై: వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తూ డిజిటల్‌ లావాదేవీలను విస్తృతం చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) సిద్ధమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించటమే కాక వినియోగదారుల్లో విశ్వాసాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. మోసపూరిత డిజిటల్‌ లావాదేవీలు జరిగితే సరైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ తరహా చెల్లింపులపై సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేవటంతో పాటు వినియోగదారుడి ప్రమేయం తగ్గించనున్నట్లు తెలిపింది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ పలు కార్యక్రమాలను చేపట్టనుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ ఇప్పటికే ప్రకటించారు. డిజిటల్‌ లావాదేవీల పట్ల విశ్వాసం పెంచేందుకు పటిష్ఠమైన చానల్‌ను ఏర్పాటు చేయటమే కాక ఒక రిడ్రెసల్‌ మెకానిజమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.
 
గతంలో ఖాతాదారులు అనధికారిక లావాదేవీలు చేపట్టి మోసపోతే వీటిని క్లెయిమ్‌ చేసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చేది. తాజాగా ఆన్‌లైన్‌, క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో ఏమైనా మోసాలు తలెత్తితే వినియోగదారుల హక్కులను పరిరిక్షించాలని ఆర్బీఐ భావిస్తోంది. కాగా ప్రీ పేమెంట్‌ చెల్లింపుల విధానంతో సంబంధం ఉన్న అనధికారిక ఎలక్ట్రానిక్‌ లావాదేవీలను చేపడితే పరిమిత స్థాయిలో వీటిని క్లెయిమ్‌ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఈ తరహా లావాదేవీల నిర్వహణపై మార్గదర్శకాలను ఈ నెలాఖరు కల్లా కేంద్ర బ్యాంక్‌ జారీ చేయనుంది.
 
సాధారణ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఖాతాదారుడి ప్రమేయం లేకుండా ఏదైనా లావాదేవీ జరిగితే.. ఆ సమాచారాన్ని మూడు పనిదినాల్లో బ్యాంకు దృష్టికి తీసుకువెళితే సదరు లావాదేవీని పరిశీలించి క్లెయిమ్‌కు అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ అనధికార లావావేవీల సమాచారాన్ని ఏడు రోజుల్లో బ్యాంక్‌ దృష్టికి తీసుకువెళితే నిబంధనల మేరకు ఖాతాదారుడికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ.18 లక్షల కోట్ల విలువైన 18.1 కోట్ల నెఫ్ట్‌ లావాదేవీలు, రూ.21.3 లక్షల కోట్ల విలువైన 48.65 కోట్ల మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిగాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
డిజిటల్‌ లావాదేవీల్లో తలెత్తిన సమస్యలకు ప్రత్యేకంగా ఒక అంబుడ్స్‌మన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ లావాదేవీల సమయంలో ఖాతాదారులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మన్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ఈ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

బ్యాంకుల రిటైల్‌, ఎంఎస్ఈ, గృహ రుణాల వడ్డీ రేట్లను మార్కెట్‌ ప్రామాణిక రేట్లతో అనుసంధానం చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. కేంద్ర బ్యాంక్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పారదర్శకత పెరగనున్నది. వ్యక్తిగత, గృహ, వాహన రుణాలతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ)కిచ్చే రుణాలపై ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను మార్కెట్‌ ప్రామాణిక రేట్లతో అనుసంధానం చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. 

ఆర్బీఐ రెపో రేట్లు, 91 రోజులు, 182 రోజుల కాలపరిమితితో కూడిన ప్రభుత్వ బాండ్లపై చెల్లించే వడ్డీ రేటుతోపాటు ఫైనాన్షియల్‌ బెంచ్‌మార్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌బీఐఎల్‌) ఏర్పాటు చేసే మరే ఇతర వడ్డీ రేట్లనైనా మార్కెట్‌ రేటుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రుణ రేట్ల విషయంలో బ్యాంకులు అంతర్జాతీయంగా ప్రామాణిక ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (పీఎల్‌ఆర్‌), బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (బీపీఎల్‌ఆర్‌), బేస్‌ రేటు, నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) వంటి విధానాలను అనుసరిస్తున్నాయి. గృహ, రిటైల్‌, ఎంఎ్‌సఈ రుణాల ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను మార్కెట్‌ ప్రామాణిక రేట్లతో అనుసంధానానికి సంబంధించి తుది మార్గదర్శకాలను ఈ నెలాఖరుకల్లా ఆర్‌బీఐ విడుదల చేయనుంది.