Asianet News TeluguAsianet News Telugu

బీఎస్‌ఎన్‌ఎల్‌కు బెయిలౌట్.. పీఎంఓ ఓకే.. ఇండియాలో నో జాబ్స్ అన్న ఫిచ్

ప్రైవేట్ మోజులో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దాని అనుబంధ ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థ ఉద్యోగులపై మాత్రం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కత్తి వేలాడుతున్నట్లే కనిపిస్తున్నది.

PMO intervenes to bail out BSNL, MTNL; asks DoT to expedite revival proposals
Author
New Delhi, First Published Apr 5, 2019, 12:18 PM IST

న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు ఉద్దీపన పథకాలు ప్రకటించేందుకు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సూత్రప్రాయంగా అంగీకరించిందని సమాచారం. ప్రధానంగా ఈ సంస్థలు ఎదుర్కొంటున్న మూడు సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారని తెలిసింది. టెలికం, ఆర్థిక శాఖల అధికారులు, నీతిఆయోగ్‌తో రెండురోజుల క్రితం పీఎంఓ అధికారులు సమావేశమై.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల భవితవ్యంపై చర్చించారు.

ఈ సమావేశంలో రెండు టెలికాం సంస్థలకు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు, ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ, సత్వరం ఆర్థికసాయం వంటి అంశాలపై మార్గసూచీ రూపొందించాలని టెలికాం విభాగాన్ని పీఎంఓ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

‘బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలను పునరుద్ధరించి, స్థిరంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే పీఎంఓ సీనియర్‌ అధికారి, టెలికాం, ఆర్థిక శాఖ, నీతిఆయోగ్‌ అధికారులతో సమావేశమయ్యారు. టెలికం సంస్థలకు ఎలాంటి ఉద్దీపన ప్రకటించాలో టెలికాం విభాగం మార్గసూచీ రూపొందిస్తోంది’ అని వివరించారు.

టెలికం సంస్థల్లో అతి తక్కువగా రూ.14,000 కోట్ల రుణం మాత్రమే ఉన్న సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. రూ.7,000 కోట్లను ప్రభుత్వం ఈక్విటీ వాటాగా చెల్లించడం ద్వారా, దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రం కేటాయించాలని కోరుతోంది. మొత్తం స్పెక్ట్రం విలువ రూ.14,000 కోట్లు అవుతుంది.

ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకూ వ్యయాలు భారీగా ఉంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు సమయంలో, టెలికాం శాఖ నుంచి వీరు ఈ రెండు సంస్థలకు బదిలీపై వచ్చారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1.76 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌కు 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

2010లో బ్రాడ్ బ్యాడ్ వైర్ లెస్ స్పెక్ట్రం కోసం ఎంటీఎన్ఎల్ ధర చెల్లింపు
బ్రాడ్‌బ్యాడ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌ కోసం 2010 వేలం ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ధర చెల్లించింది. దీనికింద జమచేసిన వడ్డీని తిరిగివ్వాలని సంస్థ కోరుతోంది. తమ భూములు, ఇతర స్థిరాస్తుల నగదీకరణకు అనుమతివ్వాలని ఇరు సంస్థలు కోరుతున్నాయి. గుజరాత్‌ తరహాలో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. 

వీఆర్ఎస్ అమలుకు ఇదీ పరిస్థితి
స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని కోరుకునే సిబ్బంది పనిచేసిన కాలానికి సంబంధించి, ప్రతి ఏడాదికి 35 రోజుల వేతనం, ఇంకా ఉన్న సర్వీసులకు సంబంధించి, ప్రతి ఏడాదికి 25 రోజుల వేతనాన్ని, పదవీ విరమణకు ముందుకొచ్చిన ఉద్యోగులకు చెల్లిస్తారు. దీనికింద బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.6365 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.2120 కోట్లు కావాలి.

వీఆర్ఎస్ వద్దే వద్దంటున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం
స్వచ్చంధ పదవీ విరమణ (వీఆర్‌ఎస్)ను ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం వ్యతిరేకించింది. సంస్థ పునరుద్ధరణకు 4జీ స్పెక్ట్రం కేటాయించాలని డిమాండ్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని ఆరోపించిన ఉద్యోగులు.. సంస్థ వ్యాపారాభివృద్ధికి 4జీ సేవల అవసరం ఉందని తెలిసినా, అందుకు అనువైన స్పెక్ట్రంను కేటాయించలేదని విమర్శించారు. 

4జీ కేటాయింపుపై గతేడాది ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు
నిరుడు జనవరిలో టెలికం మంత్రి మనోజ్ సిన్హా.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రంను కేటాయిస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని గురువారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. కాగా, టెలికం శాఖ 4జీ స్పెక్ట్రం కోసం సిఫార్సు చేసినా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ బీఎస్‌ఎన్‌ఎల్ వ్యాపార సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ అడ్డుకున్నదని తెలుస్తున్నది.

పెరిగిపోతున్న నిరుద్యోగం: ఫిచ్ 
భారత్‌లో నిరుద్యోగం గణనీయంగా పెరిగిపోతోందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఫిచ్‌’ ప్రకటించింది. రైతుల ఆదాయం భారీగా తగ్గిపోవటం, తయారీ రంగం నిరాశాజనకరమైన పనితీరుతో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు భారత రేటింగ్‌ను ‘నిలకడ (స్టేబుల్‌)’ నుంచి బీబీబీ మైన్‌సకు తగ్గించినట్లు ఫిచ్‌ తెలిపింది. భారత వృద్ధి హరించుకుపోవటానికి దేశీయ అంశాలే ప్రధాన కారణమని పేర్కొంది. 

వీక్ మాన్యుఫాక్చరింగ్.. రైతుల ఆదాయం తగ్గుదల
బలహీనమైన మాన్యుఫాక్చరింగ్ సెక్టార్, ఫుడ్ ఇన్ ఫ్లేషన్ వల్ల రైతుల ఆదాయం తగ్గటం.. వృద్ధి రేటుకు గండిపడే అవకాశాలుండటమేకాకుండా నిరుద్యోగం పెరగటానికి చిహ్నాలుగా ఉన్నాయని తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో గ్రామీణ ఆదాయం తగ్గుముఖం పట్టిందని, నిరుద్యోగం పెరిగిపోతోందని ఫిచ్‌ ప్రకటించటం గమనార్హం. 

మళ్లీ బీబీబీ నెగిటివ్ రేటింగ్.. 13 ఏళ్లుగా ఇదే పరిస్థితి
భారత రేటింగ్‌ను మరోసారి బీబీబీ-నే ఇచ్చింది ఫిచ్. పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ఇచ్చే రేటింగ్‌లో ఇదే అధమం. గడిచిన 13 ఏండ్లుగా ఇదే రేటింగ్ ఇవ్వడం విశేషం. ఆగస్టు 1, 2006 నాడు భారత రేటింగ్‌ను బీబీ + నుంచి బీబీబీ-కి తగ్గించిన తర్వాత మళ్లీ పెంచలేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తంచేసిన ఫిచ్..ముఖ్యంగా విదేశీ మారకం నిల్వలు కరిగిపోవడం, ప్రజల రుణాలు మరింత పెరుగడం, ఆర్థికరంగం బలహీనంగా ఉండటం, సంస్థాగత సంస్కరణలకు పెద్ద పీట వేయకపోవడంతో స్వల్పకాలంపాటు ఆర్థిక వ్యవస్థ ఆందోళన కరస్థాయిలో కదలాడనున్నదని ఫిచ్ హెచ్చరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios