Asianet News TeluguAsianet News Telugu

పేటీఎం నుంచి క్రెడిట్‌ కార్డు!

డిజిటల్ చెల్లింపుల వ్యాలెట్ ‘పేటీఎం’ తన వినియోగదారుల కోసం ఫస్ట్ కార్డు పేరిట క్రెడిట్ కార్డును విడుదల చేసింది. సిటీ బ్యాంక్ సహయంతో రూపొందించిన ఈ కార్డు ద్వారా ఏటా రూ.50 వేల వరకు డిజిటల్ చెల్లింపులు జరుపొచ్చు.
 

Paytm First Card Launched in Partnership With Citi, a Credit Card With 'Universal Unlimited Cashback'
Author
New Delhi, First Published May 15, 2019, 12:38 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్‌ వ్యాలెట్‌ సంస్థ పేటీఎం మార్కెట్లోకి క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చింది. సిటీ బ్యాంక్‌ భాగస్వామ్యంతో కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుగా దీనిని మార్కెట్లోకి తెచ్చింది. పేటీఎం యాప్‌ నుంచే పేటీఎం ఫస్ట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు యూజర్లు డైనింగ్‌, షాపింగ్‌, ట్రావెల్‌ వంటి వాటికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్‌ ఆఫర్లు కూడా పొందొచ్చు. పేటీఎం క్రెడిట్‌ కార్డుతో ప్రతి లావాదేవీపై ఒక శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు ఉండవు. ప్రతి నెల ఈ క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డు అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా జమ అవుతుంది.

పేటీఎం ఫస్ట్ (క్రెడిట్) కార్డు వినియోగదారులు ఏటా రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా రూ.50 వేల వరకు క్రెడిట్ కార్డు నుంచి వాడుకునే వెసులుబాటు లభిస్తుంది.

ప్రారంభ దశలో ప్రోమో కోడ్ కింద రూ.10 వేల వరకు పేటీఎం ఫస్ట్ కార్డు నుంచి వాడుకోవచ్చు. అదే సమయంలో వినియోగదారులు వాడుకున్న డబ్బుపై ఒకశాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి నెలా ఆటో క్రెడిట్ అవుతుంది. నూతన క్రెడిట్ కార్డు పాస్ బుక్ ద్వారా పేటీఎం, సిటీ బ్యాంక్ అందించే ప్రత్యేకమైన ఆఫర్లు తెలుసుకోవచ్చు. 2017 సెప్టెంబర్ నెలలో ఆవిష్కరించిన పేటీఎం డెబిట్ కార్డు చెల్లింపులు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమయ్యాయి.

కానీ పేటీఎం ఫస్ట్ కం క్రెడిట్ కార్డు అంతర్జాతీయంగా కూడా వాడుకోవచ్చు. పేటీఎం సీఈఓ కం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ తమ కస్టమర్లు భారీగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా క్రెడిట్ కార్డు ఉపకరిస్తుందన్నారు.

మాస్టర్ కార్డ్ ప్లస్ గోల్డ్ మన్ సాచెస్ సహకారంతో ఆపిల్ తన వినియోగదారులకు విడుదల చేసిన టైటానియం క్రెడిట్ కార్డుకు పోటీగా పేటీఎం ఫస్ట్ కార్డు తీసుకొచ్చింది. ఈ రెండు కార్డుల మధ్య డిజిటల్ చెల్లింపుల్లో పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు. 

వీసా నుంచి కామన్‌ మొబిలిటీ కార్డ్‌
చెల్లింపుల టెక్నాలజీలో అంతర్జాతీయ అగ్రగామి అయిన వీసా తాజాగా భారత ప్రభుత్వ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ మంత్రిత్వశాఖ రూపొందించిన జాతీయ ఉమ్మడి మొబిలిటీ కార్డు (ఎన్‌సిఎంసి)ని ఆవిష్కరించింది. దీన్ని మెట్రో, బస్సు, సబర్బన్‌ రైల్వేలు, టోల్‌, పార్కింగ్‌, స్మార్ట్‌ సిటీ, రిటైల్‌ సహా అన్ని విభాగాలలో చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చని వీసా గ్రూప్‌ కంట్రీ మేనేజర్‌ టిఆర్‌ రామచంద్రన్‌ పేర్కొన్నారు.

డిజిటల్ చెల్లింపులకు మొబిలిటీ కార్డుతో వీలు
ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో రవాణా అనేది ఒక ముఖ్యమైన విభాగంగా ఉందని. స్థానిక ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ చెల్లింపులను అనుసరించేందుకు కామన్‌ మొబిలిటీ కార్డ్‌ వీలు కల్పిస్తుందని వీసా గ్రూప్‌ కంట్రీ మేనేజర్‌ టిఆర్‌ రామచంద్రన్‌ అన్నారు. ఎన్‌సిఎంసి కాంటాక్ట్‌ లెస్‌ కార్డులు రవాణా రంగం అంతటా డిజిటల్‌ చెల్లింపులను అనువర్తితం చేసుకోవడాన్ని వేగవంతం చేస్తాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios