Asianet News TeluguAsianet News Telugu

చిక్కుల్లో స్టార్టప్‌లు: కేంద్రం నోటీసులు

స్టార్టప్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ వాల్యుయేషన్లతో షేర్ల కేటాయింపుపై ఆదాయం పన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖల కన్ను పడింది. ఈ మేరకు 2000కి పైగా కంపెనీలకు కార్పొరేట్ వ్యవహారాలశాఖ నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందే తమకు ఐటీ చెల్లించాలని ఆదాయం పన్నుశాఖ జారీ చేసిన నోటీసులపై సమాధానం చెప్పలేకపోతున్న స్టార్టప్ యాజమాన్యాలకు ఎంసీఎ నోటీసులు మరింత తలనొప్పిగా మారనున్నాయి.

Over 2000 Startups Under The Scanner: Ministry Of Corporate Affairs Issues Notices Over High Premium Of Shares
Author
New Delhi, First Published Nov 24, 2018, 10:25 AM IST

న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్‌ సంస్థలు భారీ వేల్యుయేషన్స్‌ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దృష్టి సారించింది. ఈ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో షేర్లు తీసుకోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడత నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్లు గణనీయంగా పడిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

2000కి పైగా స్టార్టప్‌లకు ఎంసీఏ నోటీసులు ఇలా
ఇందులో భాగంగా 2013 నుంచి నిధులు సమీకరించిన 2,000 పైచిలుకు స్టార్టప్లకు గత 45 రోజుల్లో నోటీసులు పంపినట్లు సమాచారం. అసలు ఏ ప్రాతిపదికన ఇంత వేల్యుయేషన్‌ లెక్కగట్టి నిధులు సమీకరించారో వివరణ ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రభుత్వ పథకం కింద మినహాయింపులేమైనా పొందాయా అన్న విషయాన్ని కూడా తెలపాలని నోటీసుల్లో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘మీ స్టార్టప్‌ సంస్థ అధిక ప్రీమియంతో షేర్లను కేటాయించడం జరిగింది. దీన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు. స్టార్టప్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి పొందిన మినహాయింపులు ఏమిటో తెలపాలి’ అని స్టార్టప్‌లకు ఎంసీఏ నోటీసులు పంపింది. వీటిల్లో ట్యాక్సేషన్‌ గురించి లేదా పెనాల్టీల గురించిన ప్రస్తావన ఏమీ లేదు.  

భవిష్యత్ లాభదాయకత ఆధారంగా స్టార్టప్ వాల్యుయేషన్
మరోవైపు, స్టార్టప్స్‌ వేల్యుయేషన్స్‌ అనేవి భవిష్యత్‌ లాభదాయకత తదితర అనేక విషయాల ఆధారంగా ఉంటాయని పన్నుల నిపుణులు తెలిపారు. వేల్యుయేషన్‌ లెక్కింపునకు పాటించే విధానాలు సందర్భానుసారంగా వివాదాస్పదంగానూ కనిపించవచ్చంటున్నారు. ఇక అధిక ప్రీమియంతో నిధులు సమీకరించినా.. వ్యాపార పరిస్థితులు, తీవ్ర పోటీ, అధిక వృద్ధి సాధనలో మేనేజ్‌మెంట్‌ విఫలంవంటి అంశాలతో వేల్యుయేషన్‌ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ట్యాక్స్‌ నిపుణులు తెలిపారు. ఆదాయం పన్ను శాఖ కూడా 2016లో స్టార్టప్ల నుంచి ఇలాంటి వివరణే అడిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎంసీఏ నోటీసులతో స్టార్టప్‌లకు మరిన్ని తలనొప్పులు
తొలి రౌండు నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్‌ పడిపోయిన పక్షంలో స్టార్టప్‌లు 33 శాతం పన్నులు కట్టాలని ఆదాయం పన్ను శాఖ డిమాండ్‌ చేస్తోంది. అయితే, ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులను మాత్రమే ఆదాయం పన్ను శాఖ ప్రశ్నించగా.. ఎంసీఏ మాత్రం వెంచర్‌ క్యాపిటల్, పీఈ లావాదేవీల సహా అన్ని రకాల పెట్టుబడులను నోటీసుల పరిధిలోకి చేర్చింది. ఆదాయం పన్ను శాఖ నోటీసులపై స్టార్టప్‌లు ఇంకా న్యాయపోరాటం కొనసాగిస్తుండగానే.. తాజాగా ఎంసీఏ నోటీసులు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయి. 

హైదరాబాద్‌లో గూగుల్‌ ‘నైబర్లీ’
గూగుల్‌ తన వినూత్న ‘నైబర్లీ’ యాప్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఈ యాప్‌ అత్యంత అనువైనదని గూగుల్‌ ప్రతినిధులు వివరించారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో సందర్శనీయ స్థలాలు ఏమిటి, ఏవిధంగా అక్కడికి వెళ్లాలి, లేదా హైదరాబాద్‌లో మంచి కోచింగ్‌ ఇనిస్టిట్యూట్లు ఎక్కడ ఉన్నాయి? కంటి చికిత్సకు మంచి ఆసుపత్రి ఏది? ఇలా ఎటువంటి సందేహాన్ని అయినా ఈ యాప్‌ ద్వారా పోస్ట్‌ చేయవచ్చు. దానికి ఎవరో ఒకరు స్పందించి తగిన సమాచారాన్ని అందించవచ్చు.  అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌ ద్వారా సేవలు అందించాలనేది తమ లక్ష్యమని గూగుల్‌ నెక్ట్స్‌ బిలియన్‌ యూజర్ల బృందం ప్రతినిధి, సీనియర్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ టెన్‌ ఫోహ్నర్‌ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios