న్యూఢిల్లీ‌: ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్లు.. అటుపై ఫ్లిప్‌ ఫోన్లు.. తర్వాత టచ్‌ స్క్రీన్‌లు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. తాజాగా ఫోల్డబుల్ ‌(మడతబెట్టే) స్మార్ట్‌ఫోన్లు అంటున్నాయి మొబైల్‌ తయారీ సంస్థలు. అవును.. ఇప్పటికే చాలా సంస్థలు వచ్చే ఏడాది మార్కెట్లోకి ఈ మోడల్‌ ఫోన్లను తయారుచేసే పనిలో తలమునకలయ్యాయి.  దక్షిణకొరియా చెందిన శామ్‌సంగ్‌ ఇటీవలే ఫోల్డబుల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది కూడా. తాజాగా ఈ జాబితాలో చైనాకు చెందిన మరో మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ఒప్పో కూడా చేరింది. వచ్చే ఏడాదిలో తమ కంపెనీ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌ను తేనున్నట్లు సంస్థ ప్రకటించింది.

నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒప్పో ప్రొడక్ట్‌ మేనేజర్‌ చుక్‌ వాంగ్‌ ఈ సంగతి మీడియాకు తెలిపారు. ఫోల్డబుల్‌ ఫోన్‌ తయారీకి ఒప్పో సిద్ధమైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై చుక్‌ వాంగ్‌ స్పష్టమైన సంకేతాలనిచ్చారు. శామ్ సంగ్, సోనీల మాదిరిగా ఫోల్డబుల్ ఫోన్ తయారీపై కేంద్రీకరించామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరగబోయే వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో ఈ ఫోన్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అయితే ఈ ఫోన్‌ ఫీచర్లను మాత్రం చుక్‌ వాంగ్‌ వెల్లడించలేదు. ఇటీవలే ఫోల్డబుల్ ఫోన్ తయారీకి పేటెంట్ లభించినట్లు తెలుస్తోంది. 

చైనాకు చెందిన మరో సంస్థ హువావే కూడా ఫోల్డబుల్‌ ఫోన్లను తయారుచేస్తోంది. 2019 జూన్‌లో ఈ ఫోన్లను విడుదల చేసేందుకు హువావే సన్నాహాలు చేస్తోంది. ఎల్జీ కూడా వచ్చే ఏడాది తమ ఫోల్డబుల్‌ ఫోన్లను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.