న్యూఢిల్లీ: ప్రస్తుతం మనం ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తున్నప్పుడు మన భావాలను ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు స్టిక్కర్లకు మించిన మార్గం మరొకటి లేదు. ఇప్పుడు ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌ సంస్థ వాట్సప్‌ కూడా ఇలాంటి స్టిక్కర్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తన బ్లాగ్‌లో ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వినియోగిచుకునేందుకు వీలుగా వాట్సప్ ఈ స్టిక్కర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌ పార్టీ డిజైనర్లను ప్రోత్సహించేందుకు వారి ద్వారా స్టిక్కర్లను రూపొందించి, ఎంపిక చేశామని వాట్సప్‌ తన బ్లాగ్‌లో రాసింది. కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు స్టేబుల్ వర్షన్ తో కూడిన ఫీచర్ అందుబాటులోకి రానున్నది. అయితే కొన్ని ఐఓఎస్ యూజర్లలో ఇప్పటికే అప్ డేట్ చేసిన స్టిక్కర్ ఫీచర్ అందుబాటులో ఉంది. 

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలలో వాట్సప్‌ వాడేవారు ఈ స్టిక్కర్లను ఇతర యాప్‌ల ద్వారా యాడ్‌ చేసుకోవచ్చు. స్టిక్కర్‌ యాప్‌లు ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసుకున్న అనంతరం ఆ స్టిక్కర్లను వాట్సప్‌లోకి ఇంపోర్ట్‌ చేసుకొని ఇతరులకు పంపుకోవచ్చని సంస్థ తెలిపింది. 

వాట్సప్‌ చాట్‌లో స్టిక్కర్‌లను ఉపయోగించుకునేందుకు ‘ప్లస్‌‌’ ఆప్షన్‌ను ఎంచుకొని స్టిక్కర్ యాప్‌ల నుంచి నచ్చిన స్టిక్కర్లను వాట్సప్‌లోకి ఇంపోర్ట్‌ చేసి షేర్‌ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మధ్య తమ మనోభావాలను కమ్యూనికేట్ చేయడానికి ఈ స్టిక్కర్ మెరుగ్గా ఉపకరిస్తుంది. ఒకింత తమాషాతో కూడిన ఆనందాన్ని కూడా ఇస్తుందీ స్టిక్కర్. 

తమ వినియోగదారులకు నూతన మార్గాన్ని స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వాట్సప్ నిర్వాహకులు తెలిపారు. వాట్సప్ కస్టమర్లు తమకు ఇష్టమైన స్టిక్కర్లను తయారు చేసుకునేందుకు అవసరమైన గైడ్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. వాట్సప్ బేటా యూజర్‌లో సైన్అప్ చేసుకుంటే మీ స్నేహితుల నుంచి స్టిక్కర్ ఫీచర్ పొందొచ్చు. ఒక్కసారి సైనప్ అయితే తదుపరి దశలో ఎమోజీ మెనులోకి ఎమోజీ, గిఫ్ ఐకాన్లు వచ్చి చేరతాయి.