న్యూఢిల్లీ: మధ్యశ్రేణి ఐటీ దిగ్గజం ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఇన్‌ఫ్రా మేజర్ లార్సన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ) చేసిన ఓపెన్ ఆఫర్ ఆమోదయోగ్యమేనని మైండ్ ట్రీ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ తేల్చేసింది. ఎల్ అండ్ టీ రూ.5080 కోట్ల వ్యయంతో షేర్‌కు రూ.980 చొప్పున కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. 

ఈ నెల 10వ తేదీన మార్కెట్ క్లోజింగ్ టైంలో స్టాక్ ఎక్స్చేంజీల్లో మైండ్ ట్రీ షేర్‌ను కమిటీ గుర్తు చేసింది. జూన్ 10 ముగింపు నాటి షేర్ ఎల్ అండ్ టీ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్ చాలా ఎక్కువ అని పేర్కొంది. ఈ నెల 10న మైండ్ ట్రీ షేర్ విలువ బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో రూ.975.50 కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ)లో రూ.974.65గా నమోదైందని మైండ్ ట్రీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  

మైండ్ ట్రీ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీకి స్వతంత్ర డైరెక్టర్ అపూర్వ పురోహిత్ సారథ్యం వహిస్తున్నారు. మిలింద్ శ్రీపాద్ సార్వాటే, బిజోయు కురియన్, అక్షయ భార్గవ్ సభ్యులుగా ఉన్నారు. వాటాదారులు ఎల్ అండ్ టీ ప్రతిపాదించిన ఓపెన్ ఆఫర్‌ను ఇండిపెండెంట్‌గా అంచనా వేసుకున్నాక నిర్ధారణకు రావాలని కమిటీ హితవు చెప్పింది. 

ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ గతవారం మైండ్ ట్రీని బలవంతంగా టేకోవర్ చేసుకోవడానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా 31 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.5030 కోట్లు పెట్టుబడి పెడతామని తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 14వ తేదీన ఎల్ అండ్ టీ ఓపెన్ ఆపర్ ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే నియంత్రణ సంస్థ సెబీ అనుమతి రాలేదు. అంతకుముందు ఎల్ అండ్ టీ ఓపెన్ మార్కెట్‌లో 28.90 శాతం మైండ్ ట్రీ వాటా కొనుగోలు చేసింది. 66 శాతం వాటా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ సంస్థ సంకల్పించింది. తద్వారా రూ.10,700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అందుకే ఈ నెల 17వ తేదీ నుంచి మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ మొదలై 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా 5,13,25, 371 షేర్లను కొనుగోలు చేయడం ఎల్ అండ్ టీ సంకల్పం. గత మార్చిలో మైండ్ ట్రీలో షేర్లను బలవంతంగా టేకోవర్ చేస్తామని ప్రకటించింది. కాఫీ డే ఓనర్ వీజీ సిద్ధార్థ నుంచి 20.32 శాతం వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది.