Asianet News TeluguAsianet News Telugu

మది నిండా ‘మైండ్‌ట్రీ’:టేకోవర్ టాప్ ప్రియారిటీ.. తేల్చేసిన ఏకే నాయక్

తమ మది నిండా ‘మైండ్ ట్రీ’ నిండిపోయిందని ఎల్ అండ్ టీ గ్రూప్ చైర్మన్ ఎ ఎం నాయక్ చెప్పారు. ఈ కంపెనీ హస్తగతమే టాప్‌ అజెండా అని తెలిపారు. పది రోజుల్లో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తామని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మైండ్‌ ట్రీని పెద్ద సంస్థగా మలుస్తాం అని ప్రకటించారు. తమ టేకోవర్ ప్రయత్నాలను మైండ్ ట్రీ ప్రమోటర్లు వ్యతిరేకించడం సహజమేనన్నారు.

Mind completely occupied with Mindtree acquisition; will make it a big firm: A M Naik
Author
New Delhi, First Published May 20, 2019, 11:53 AM IST

న్యూఢిల్లీ: మైండ్‌ట్రీ... ఓ మిడ్‌సైజ్డ్‌ ఐటీ కంపెనీ. దీన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టర్బో (ఎల్‌ అండ్‌ టీ) గత కొన్ని రోజులుగా వాటాలను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం మైండ్‌ట్రీలో ఎల్‌ అండ్‌ టీ వాటా 26 శాతానికి చేరుకుంది.

‘మైండ్‌ ట్రీ’ను టేకోవర్ చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యం అని ఇన్ ఫ్రా దిగ్గజం ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ వాటా కొనుగోలుతో మైండ్ ట్రీ టేకోవర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఏఎం నాయక్ నేరుగా స్పందించడం ఇదే ప్రథమం.

మధ్యస్థాయి సంస్థగా ఉన్న మైండ్‌ ట్రీని పెద్ద సంస్థగా తీర్చిదిద్దుతామనే ఎల్ అండ్ టీ అధినేత ఏఎం నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మైండ్‌ ట్రీలో మొత్తం వాటాను దాదాపు 26 శాతానికి పెంచుకున్నామని, అదనపు వాటా కొనుగోలు చేయడానికి వచ్చే 10 రోజుల్లో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనున్నట్లు తెలిపారు. 

‘కొత్త అవకాశాల కోసం నిరంతరం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మా మదినిండా మైండ్‌ట్రీయే ఉంది. మైండ్‌ ట్రీని అత్యుత్తమ సంస్థగా నిలుపుతామనే నమ్మకం ఉంది. మైండ్‌ ట్రీలో వాటా 51 శాతానికి పెంచుకునే వరకు ఎదురుచూస్తాం. 10-12 రోజుల్లో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తాం’ అని నాయక్‌ పేర్కొన్నారు. 

ఎల్‌ అండ్‌ టీ టేకోవర్‌ బిడ్‌ను మైండ్‌ ట్రీ ప్రమోటర్లు వ్యతిరేకించడంపై ఏఎం నాయక్ స్పందించారు.  మైండ్‌ట్రీని  కంపెనీతో వారికున్న అనుబంధం కారణంగా ఎల్‌ అండ్‌ టీ బలవంతంగా టేకోవర్‌ చేస్తోందని ఆ కంపెనీ ప్రమోటర్లు మాట్లాడి ఉండవచ్చని, అయితే ఎల్‌ అండ్‌ టీ కూడా ఉద్యోగుల కేంద్రీకృత సంస్థ అని వారు తెలుసుకుంటున్నారని అన్నారు.

‘మైండ్‌ ట్రీ ప్రమోటర్లు కంపెనీతో అనుబంధం కలిగి ఉండటం సహజమే. వారు అంత తేలికగా కంపెనీని వదులుకోరు. ఇప్పుడు ఎల్‌ అండ్‌ టీ మంచి కంపెనీగా వారు భావిస్తున్నారు. మైండ్‌ ట్రీ ఉద్యోగులకు సైతం ఇది మేలు చేకూరుస్తుంది. మేము వాటా కొనుగోలుకు ఎటువంటి ఒత్తిడి చేయం. వారికి ఎప్పుడు నచ్చితే అప్పుడు విక్రయించవచ్చు. మేము వాటా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని నాయక్‌ వివరించారు. 

ఎలాగైనా వాళ్లు విక్రయించాలనుకుంటున్నారని ఎల్ అండ్ టీ అధినేత ఏఎం నాయక్ తెలిపారు. వారందరి వాటా దాదాపు 12 శాతం వరకు ఉందని, వారిని వాటా విక్రయించి కంపెనీ నుంచి వెళ్లిపొమ్మని ఏమీ చెప్పడం లేదని అన్నారు.

మైండ్‌ ట్రీ కొనుగోలు బిలియన్‌ డాలర్ల విలువైందని, ఈ రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని ఎల్ అండ్ టీ అధినేత ఏఎం నాయక్ అభిప్రాయపడ్డారు. ఐటీ, ఇంజినీరింగ్‌ సేవల్లో మెరుగ్గా రాణిస్తామన్నారు. 

 మైండ్‌ట్రీని కొనుగోలు చేసిన తర్వాత ఐటీ, ఇంజనీరింగ్‌ సర్వీసులో కంపెనీ 300 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఎల్ అండ్ అధినేత ఎఎం నాయక్ చెప్పారు. వచ్చే మూడునాలుగేళ్లలో దీన్ని 500 కోట్ల డాలర్లకు చేర్చాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. 

ఇంతకు ముందు మైండ్‌ట్రీలో వీజీ సిద్ధార్థ, కేఫ్‌ కాఫీ డేకున్న దాదాపు 20.34 శాతం వాటాను రూ.3,210 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి క్రమంగా షేర్లను కొనుగోలు చేస్తోంది. మొత్తంగా మైండ్‌ట్రీలో 66 శాతం వరకు వాటాను కొనుగోలు చేయాలన్నది ఎల్‌ అండ్‌ టీ లక్ష్యం. ఈ వాటా విలువ దాదాపు రూ.10,800 కోట్ల వరకు ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios