న్యూయార్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే ఆర్థికపరమైన సత్తా మైక్రోసాఫ్ట్‌కు ఉందని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని, కరోనా వైరస్ ప్రభావం నుంచి వెంటనే బయటపడతామన్న నమ్మకం తమకు ఉన్నదని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. 

కరోనా వైరస్ సంక్షోభం నుంచి తాము సులభంగా బయట పడతామని సత్య నాదెళ్ల విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి మూలంగా అమెరికా, యూరప్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయని, వీటిలో డిమాండ్‌ అలాగే ఉంటుందా, గిరాకీపై ఎంత మాత్రం ప్రభావం పడిందన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కిట్స్‌ డిమాండ్‌ను తీర్చుతున్నామని సత్య నాదెళ్ల తెలిపారు. ఇంటి నుంచే క్లయింట్ల అవసరాలు తీరుస్తున్న విధానంపై సత్య నాదెళ్ల సంత్రుప్తి వ్యక్తం చేశారు. సప్లయ్‌ పరంగానే కొన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నామని, త్వరలో పూర్వస్థాయికి చేరుకుంటున్నామని చెప్పారు. 

ఉత్పత్తుల నాణ్యతతోపాటు వ్యక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కొవిడ్- 19 తీవ్రత వెలుగు చూడక ముందు ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ సహా పలు సర్ఫేస్ డివైజెస్‌ను విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రజల భద్రతపైనే ఎక్కువ కేంద్రీకరించామని సత్య నాదెళ్ల వెల్లడించారు. 

ఉద్దీపన ప్యాకేజీలను అమలు చేసేందుకు ముందుకు వచ్చే అమెరికా ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తామని సత్య నాదెళ్ల చెప్పారు. ‘ప్రభుత్వం సరిగ్గానే స్పందిస్తుందని నేను భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండే కంపెనీల్లో ఉద్యోగులు, చిన్న వ్యాపారాలపై ప్రభుత్వం ద్రుష్టిని కేంద్రీకరించింది’ అని తెలిపారు. ఈ సంస్థలు, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడమే దీనికి కారణం అని అన్నారు. 

ఇదిలా ఉంటే తమ సంస్థ విండోస్ డివిజన్ వంటి విభాగాల్లో రెవెన్యూ గైడెన్స్ అంచనాల కంటే వెనుకబడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గత నెలలో చెప్పారు. అయితే, తమ సంస్థ ఆర్థిక మూలాలు బాగానే ఉన్నాయన్నారు. కంపెనీ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సేవలకు డిమాండ్ పెరుగుతున్నదని తెలిపారు. 

also read:జియోలో వాటా కొనుగోలుకు ఫేస్‌బుక్‌: విలువైన సంస్థగా రిలయన్స్

ఒకవేళ ఇంతకుముందు మాదిరిగా డేటా సెంటర్ ఆర్కిటెక్స్ లేదా సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్చర్స్ మాత్రమే ఉంటే ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే వారమే కాదని సత్య నాదెళ్ల చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై ఆయన స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ ఇంతకుముందు కూడా ఇంటి వద్ద నుంచి పని చేయాలని అడ్వైజ్ చేసిన తొలి ఐటీ సంస్థల్లో ఒకటిగా ఉండేదన్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. సత్య నాదెళ్ల. తన కూతుళ్లతో తన ఆఫీస్ షేర్ చేసుకుంటానని, వారు కూడా తనకు డెస్క్ సెట్ అప్ చేయడంలో సహకరించారని మెచ్చుకున్నారు. ఇంతకుముందు సత్య నాదెళ్ల ‘నేను ఎల్ల వేళలా నా బెడ్ వద్ద నుంచే పని చేయడానికి ఆసక్తి చూపుతాను‘ అని చెప్పారు.