ప్రస్తుతం ప్రపంచమంతటా కృత్రిమ మేధస్సు కబుర్లే.. వ్యాపార సంస్థల్లో దాన్ని ఎక్కడ, ఎలా వాడాలి? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? వ్యాపార సంస్థలో ఉన్న అధికారులకు ఇలాంటివి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వీటికి పరిష్కారం చూపే దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ బృందం ఆన్‌లైన్‌లో కృత్రిమ మేధస్సు పాఠాలు చెప్పేందుకు సిద్ధం అయ్యింది. 

ఇలా మైక్రోసాఫ్ట్ ఉచితంగా వ్యాపారవేత్తలకు పాఠాలు
కృత్రిమ మేధస్సుపై బిజినెస్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసి, వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్‌లో ఉచితంగా పాఠాలు నేర్పించనున్నది. దీనిద్వారా వారు కొత్త తరం సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఏఐ)ను సులభంగా వాడుకునేందుకు వీలుగా తోడ్పడనున్నది. 

ప్రత్యక్ష ఉదాహరణలతో వీడియోల ద్వారా బోధన
కృత్రిమ మేధస్సుపై బిజినెస్‌ స్కూలు కోర్సులో భాగంగా కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు, వీడియోలు, చర్చలు తదితరాలను వివరిస్తూ బోధన సాగిస్తుంది. తీవ్ర పని ఒత్తిడిలో ఉండే ఉన్నతాధికారులను, వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకొని ఇవి చిన్న చిన్న భాగాలు కానున్నాయి. వారికి సమయం ఉన్నప్పుడే వాటిని చూసేందుకు వీలుంది.

ఇంట్రడక్టరీ వీడియోల ద్వారా నిర్వహణా పద్దతులపై టీచింగ్
కృత్రిమ మేధస్సు టెక్నాలజీ నిర్వహణ పద్దతులు తెలుసుకునేందుకు షార్ట్ ఇంట్రడక్టరీ వీడియోల ద్వారా బోధిస్తుంది. ఆయా పరిశ్రమల్లో తేవాల్సిన మార్పులపై ద్రుష్టి సారిస్తుంది మైక్రోసాఫ్ట్. కంపెనీ వ్యూహం, మేనేజ్మెంట్ ప్రభావం, సంస్క్రుతి, బాధ్యత తదితర అంశాలపై వీడియోల ద్వారా పాఠాలు బోధించనున్నది. 

వ్యాపారవేత్తలకు ఇలా కృత్రిమ మేధస్సు ‘కోర్సు’తో ఉపయోగం
కృత్రిమ మేధస్సుపై (ఏఐ), డేటా సైన్స్‌లో తమ నైపుణ్యాలను పెంచుకోవాలని భావించే వారికి ఆ కోర్సు ఉపయోగపడనున్నది. మైక్రోసాఫ్ట్‌ అందించే ఇతర కోర్సులతో పోలిస్తే.. ఈ కోర్సు పూర్తిగా భిన్నం. కేవలం కార్యనిర్వహణ అధికారులు తమ సంస్థలను కృత్రిమ మేధ కోసం ఎలా సిద్ధం చేయొచ్చు, దానిని నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలను మాత్రమే చెబుతారు. యూరప్‌, ఆసియా తదితర ప్రాంతాల్లో బిజినెస్‌ స్కూళ్లను నడిపిస్తున్న ఇన్‌సీడ్‌ గ్రాడ్యుయేట్‌ బిజినెస్‌ స్కూల్‌ ఈ ఏఐ బిజినెస్‌ స్కూల్‌ పాఠాలను తయారు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌కు సహకారాన్ని అందించింది.

హైదరాబాద్‌తోపాటు స్టార్టప్‌ల కోసం ఫేస్‌బుక్‌ హబ్స్‌
ఇన్నోవేషన్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలిచేందుకు ఫేస్‌బుక్‌ హబ్స్‌ను ప్రారంభించినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. మెంటార్స్‌తో సమావేశాలు నిర్వహించటం ద్వారా స్టార్టప్‌ కమ్యూనిటీకి మరింత ప్రోత్సాహం అందించటంతో పాటు శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌, చర్చలు సాగించేందుకు ఈ హబ్స్‌ తోడ్పాటునందించనున్నాయని తెలిపింది. 

20 నగరాల పరిధిలో ఫేస్ బుక్ ‘హబ్స్’ ఇలా
హైదరాబాద్‌, ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణె, గోవా సహా దేశవ్యాప్తంగా 20కి పైగా ప్రాంతాల్లో ఈ ఫేస్‌బుక్‌ హబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. స్టార్టప్స్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింతగా విస్తరణకు ఏడాదిపాటు అవసరమైన శిక్షణను అందించేందుకు 91స్ర్పింగ్‌బోర్డ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఫేస్‌బుక్‌ ఇండియా ప్రొడక్ట్‌ హెడ్‌ సత్యజిత్‌ సింగ్‌ తెలిపారు.