న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్‌ ఇండియా విజన్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా మంగళవారం డిజిటల్‌ గవర్నెన్స్ టెక్‌ టూర్‌ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఐటీ విభాగాలకు ఇన్‌ఛార్జులుగా ఉన్న ప్రభుత్వాధికారులకు కీలకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఇంటెలిజెంట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారు. 

వచ్చే ఏడాదిలోపు వర్క్ షాపులు నిర్వహించి 5,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకోవడంతోపాటు ఉత్పాదకతతో కూడిన, పారదర్శక పాలన అందించేందుకు భద్రతతో కూడిన క్లౌడ్‌ టెక్నాలజీని ప్రభుత్వ సంస్థలకు మైక్రోసాఫ్ట్‌ అందించనుంది.

నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ దేశంలో సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ఎఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా ఎనలిటిక్స్‌ను కీలక రంగాల్లో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

విద్యా సంస్థలు, ఐటీ పరిశ్రమతో కలిసి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పునాది బలోపేతం చేస్తామని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ అనలిటిక్స్ రంగాలు భారత ప్రగతిని ఆవిష్కరించనున్నాయని తెలిపారు.