న్యూఢిల్లీ: గ్లోబల్‌ సర్వర్లలో నిక్షిప్తమైన ఉన్న భారతీయులకు సంబంధించిన డేటాను తొలగిస్తామని  అంతర్జాతీయ కార్డు చెల్లింపుల సేవల సంస్థ మాస్టర్‌ కార్డు తెలిపింది. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. తాము గ్లోబల్‌ సర్వర్ల నుంచి డేటాను తొలగించినా ‘భద్రత’ విషయంలో ఇంకా బలహీనంగా ఉంటుందని మాస్టర్‌ కార్డ్‌ ఏషియా అధ్యక్షుడు పోరుష్‌ సింగ్‌ తెలిపారు.

బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన వివరాలతో పాటు, భారతీయుల వివరాలను పేమెంట్‌ కంపెనీలు అంతర్జాతీయ సర్వర్ల నుంచి తొలగించాలని గత ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16 నుంచి దీన్ని అమల్లోకి తేవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అంతర్జాతీయ సర్వర్లలో ఉన్న భారతీయుల వివరాలను తొలగించనున్నట్లు మాస్టర్‌కార్డ్‌ పేర్కొంది.

భారతీయులు జరిపిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను పుణెలోని తమ టెక్నాలజీ సెంటర్‌లో అక్టోబర్ ఆరో తేదీనే భద్రపరిచినట్లు పేర్కొంది. ‘ఆర్బీఐ ప్రతిపాదనల మేరకు భారతీయుల డేటా ఎక్కడ ఉన్నా దాన్ని తొలగిస్తాం. వారి సమాచార వివరాలను కేవలం భారత్‌లోనే భద్రపరుస్తాం’ అని పోరుష్ సింగ్‌ చెప్పారు.

ఆర్బీఐ నిర్ధారిస్తే విదేశీ సర్వర్ల నుంచి డేటా తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో కొంతకాలం పాటు భద్రతా ప్రమాణాలు బలహీనమయ్యే అవకాశమూ ఉందని మాస్టర్‌కార్డ్‌ హెచ్చరించింది. 

‘200 దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఏ దేశం కూడా తమ కార్డుదారుల సమాచారాన్ని అంతర్జాతీయ సర్వర్ల నుంచి తొలగించాలని అడగలేదు. భారత్‌ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది’ అని మాస్టర్‌కార్డ్‌ ఇండియా, దక్షిణాసియా ప్రాంత అధ్యక్షుడు పోరుష్‌ సింగ్‌ తెలిపారు. 

‘నిర్ణీత తేదీ నుంచి సమాచారం తొలగించడానికి కూడా ఆర్బీఐ ముందు ప్రతిపాదన ఉంచాం. కార్డు నంబర్, లావాదేవీల వివరాలు భారత్‌లో మినహా మరెక్కడా మేం నిక్షిప్తం చేయదలచుకోలేదు. దీనివల్ల ఎదురయ్యే పరిణామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం’ అని పోరుష్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

లావాదేవీలపై వివాదాలు కూడా తలెత్తే వీలుందని మాస్టర్ కార్డ్ ఇండియా, దక్షిణాసియా ప్రాంత అధ్యక్షుడు పోరుష్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశీయంగా డేటా నిల్వకు ఖర్చు పెరుగుతుందని వివరించారు.