శాన్‌ఫ్రాన్సిస్కో: డేటా లీక్ ఆరోపణల నేపథ్యంలో మదుపర్ల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి తనకు రాజీనామా చేసే ఆలోచన లేదని వెల్లడించారు. పెట్టుబడిదారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ పదవి నుంచి దిగిపోవడానికి ఆయన అంగీకరించడం లేదు. 

డేటా లీకేజీ సహా తదితర కారణాల వల్ల బోర్డు ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని జుకర్‌బర్గ్‌ను కొందరు ఇన్వెస్టర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాత్రి జుకర్‌బర్గ్‌ సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయబోనని స్పష్టంచేశారు. తాను పదవి నుంచి దిగిపోవడానికి ఇది సరైన సమయం కాదని వెల్లడించారు.

కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం ద్వారా ఫేస్‌బుక్‌ డేటా లీక్‌, ఫేస్‌బుక్‌ రిపబ్లికన్లకు చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ రిలేషన్స్‌ సంస్థ(పీఆర్‌ ఫిర్మ్)‌తో ఒప్పందం కుదుర్చుకున్న అంశాలపై ఇటీవల న్యూయార్క్‌టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాలకు సంబంధించి పలు హెచ్చరికలను జుకర్‌బర్గ్‌, సీఓఓ శ్రేయాల్‌ శాండ్‌బర్గ్‌ నిర్లక్ష్యం చేశారని ఆరోపించింది. 

పెట్టుబడిదారుల నుంచి జుకర్‌బర్గ్‌కు రాజీనామా ఒత్తిళ్లు వస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ స్పందించారు. ‘నేను కంపెనీ నడుపుతున్నాను. ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత.’ అని జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం విషయంపై జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించగా.. నిజంగా ముఖ్యమైన అంశాన్ని మేము మిస్సయ్యాం అని, ఇందులో సందేహమేమీ లేదని అన్నారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని తెలిపారు. దీన్ని 2016కు ముందే అర్థం చేసుకొని ఉండాల్సింది అని వెల్లడించారు.

సంస్థ బోర్డుపై తనకు నియంత్రణ ఉన్నదని, స్వచ్ఛందంగా వైదొలుగాల్సిన అవసరం లేదని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం తాను దాని గురించి ఆలోచించడమే లేదన్నారు. ఫేస్ బుక్ సీఓఓ శ్రేయాల్ శాండ్ బర్గ్ తన విధులు తాను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కొన్నేళ్లుగా సంస్థలో పని చేస్తున్న శ్రేయాల్ వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని, ఆమెను, ఆమె టీంను జుకర్ బర్గ్ నిందించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఒక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ స్పందిస్తూ శ్రేయాల్ సంస్థలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పెద్ద సమస్యలను పరిష్కరించడంలో ఆమె క్రుషి చేస్తున్నారని చెప్పారు. పదేళ్లుగా తనకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. తామిద్దరం కలిసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉన్నదని, మరికొన్ని దశాబ్దాల పాటు కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు జుకర్ బర్గ్ పేర్కొన్నారు.