Asianet News TeluguAsianet News Telugu

మైండ్‌ట్రీపై పట్టు బిగిస్తున్న ఎల్ అండ్ టీ.. త్వరలో ఓపెన్ ఆఫర్


ఐటీ సంస్థ మైండ్ ట్రీపై ఎల్ అండ్ టీ క్రమంగా పట్టు బిగుస్తోంది. శుక్రవారంతో ముగిసిన వారానికి బహిరంగ మార్కెట్లో మరో 24.9 లక్షల షేర్లను కొనుగోలు చేసి తన వాటాను 28.45 శాతానికి పెంచుకున్నది. సెబీ, తదితర మార్కెట్ నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 10-12 రోజుల గడువుతో ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నది. తద్వారా 66 శాతం వాటా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ భావిస్తోంది.

L&T hikes shareholding in Mindtree to 28.45 pc, picks up 24.9 lakh shares
Author
New Delhi, First Published May 25, 2019, 4:26 PM IST

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ లో ఎల్‌ అండ్‌ టీ తన వాటాను క్రమంగా పెంచుకుంటోంది. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి తాజాగా మరో 24.9 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. దీంతో మైండ్‌ట్రీ ఈక్విటీలో తమ వాటా 28.45 శాతానికి చేరిందని బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

24.9 లక్షల షేర్లు రూ.980 చొప్పున కొనుగోలు
శుక్రవారం ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసిన 24.9 లక్షల షేర్లను ఒక్కో షేర్ రూ.980 చొప్పున ఎల్‌ అండ్‌ టీ కొనుగోలు చేసింది. ఈ నెల ప్రారంభంలో మైండ్‌ట్రీ ఇన్వెస్టర్లలో ఒకరైన కేఫ్‌ కాఫీ డే ప్రమోటర్‌ వీజీ సిద్దార్ధ నుంచి 20.34 శాతం వాటాకు సమానమైన షేర్లను ఎల్‌ అండ్‌ టీ కంపెనీ రూ.3,210 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఓపెన్ ఆఫర్ ద్వారా 66 శాతం వాటా కొనుగోలు ఎల్ అండ్ టీ లక్ష్యం
త్వరలో ప్రకటించే ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా, మైండ్‌ట్రీ ఈక్విటీలో తమ వాటాను 66 శాతానికి పెంచుకోవాలని ఎల్‌ అండ్‌ టీ భావిస్తోంది. ఇందుకోసం రూ.10,800 కోట్లు సిద్ధం చేసింది. మైండ్‌ట్రీ ఈక్విటీలో మెజారిటీ వాటా చేజిక్కించుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రాధాన్యత అని ఎల్‌ అండ్‌ టీ గ్రూపు చైర్మన్‌ ఏఎం నాయక్‌ ఇటీవల చెప్పారు. 

14-27 మధ్య ఓపెన్ ఆఫర్‌ ప్రతిపాదనకు లభించని పర్మిషన్
గురువారం ఓపెన్ మార్కెట్లో మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ 4.5 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ నెల 14 - 27 మధ్య ఓపెన్ ఆఫర్ ద్వారా అదనపు వాటా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ ప్రతిపాదించింది. కానీ ఓపెన్ ఆఫర్ ప్రకటనను ఇంకా ప్రకటించలేదు. 

త్వరలో 10-12 రోజుల గడువుతో ఓపెన్ ఆఫర్
ఓపెన్ ఆఫర్ ప్రకటించేందుకు సెబీ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించలేదు. సంస్థలో 51 శాతం వాటా కొనుగోలు చేసే వరకు వేచి చూస్తామని ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు. సెబీ తదితర సంస్థల అనుమతి తర్వాత 10 -12 రోజుల గడువుతో ఓపెన్ ఆఫర్ ప్రకటించడానికి ఎల్ అండ్ టీ సిద్ధం అవుతోంది. 

ఫుడ్‌పాండాకు ఓలా బిగ్‌ షాక్‌!
క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి తగ్గట్లు సంస్థ నుంచి అనేక మంది ఉద్యోగులకు కూడా తొలగించాలని నిర్ణయించింది. 

1500 మంది డెలివరీ ఉద్యోగులతో కాంట్రాక్ట్ రద్దు
సుమారు 40మంది ఎంట్రీ-మిడ్‌ స్థాయి సిబ్బందికి తోడు మరో 1,500 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవుల కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. అయితే ఫుడ్‌ పాండా ప్రైవేటు లేబుల్స్‌ క్రింద తన బిజినెస్‌ను యథావిధిగా కొనసాగిస్తుంది. గత ఏడాది స్విగ్గీ, జొమాటో, ఉబెర్‌ ఈట్స్‌ పోటీపడేందుకు ఫుడ్‌పాండా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్విగ్గీ, జొమాటోలకు రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా, ఫుడ్‌ పాండా రోజు 5వేల ఆర్డర్లను సాధిస్తోందని లెక్కలు చెబుతున్నాయి. 

ఇక ఇన్ హౌస్ బ్రాండ్ల కొనసాగింపునకే ఓలా నిర్ణయం
ఆహార పంపిణీ సంస్థలో ఓలా కూడా 200 మిలియన్ల డార్లు (సుమారు రూ.1300 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ప్రధానంగా స్విగ్గీ, జొమాటో లాంటి వాటికోసం తమ డబ్బును వృధా చేసుకోవాలని భావించడం లేదని నివేదించింది. ఇన్‌హౌస్‌ బ్రాండ్లనే కొనసాగించాలని నిర్ణయించింది. 1,500 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌  కాంట్రాక్టులను రద్దు చేసింది.  ఫుడ్‌ పాండా ప్రైవేట్ లేబుల్స్ క్రింద  తన బిజినెస్‌ను యథావిధిగా కొనసాగిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios