న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్‌ సోకిందేమోనన్న అనుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబును కూడా కొందరు తీవ్రంగా పరిగణిస్తూ భయపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నవారు తమకు ఎంత రిస్క్‌ ఉందో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారులు సెల్ఫ్‌ డయాగ్నోసిస్‌ చేసుకునేందుకు టూల్స్‌ను తీసుకొచ్చాయి.

మీ ఆరోగ్య స్థితి, ప్రయాణ చరిత్ర, ఇతరత్రా వివరాలను బట్టి కరోనా వైరస్‌ రిస్క్‌ను అంచనా వేస్తూ తగిన సూచనలిస్తుంటాయి. కరోనాపై పోరులో భాగంగా ఈ టూల్స్‌ను ఈ రెండు సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉంచాయి.

రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన ఈ టూల్‌ ‘మై జియో’ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీనికోసం ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ ‘https://covid.bhaarat.ai/’ కూడా రూపొందించింది. 

గతంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని మీరు కలిశారా? ప్రయాణాలు చేశారా? మీకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలకు మీరిచ్చే సమాధానం ఆధారంగా ఫలితాలను ఈ టూల్‌ వెల్లడిస్తోంది. మీ రిస్క్‌ స్థాయిని చెప్పడంతో పాటు దగ్గర లోని ల్యాబ్‌ల వివరాలు, ప్రపంచ వ్యాప్తంగా కేసులకు సంబంధించిన గణంకాలను జియో యాప్ అందిస్తోంది.

also read:లాక్‌డౌన్‌తో ‘ఈ-రిటైల్స్’కు కష్టాలు: లక్షల ఆర్డర్లు రద్దు.. లేదా రీ షెడ్యూల్

అటు ఎయిర్‌టెల్‌ సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను అనుసరించి అపోలో హాస్పిటల్స్‌ సహకారంతో ఓ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

దీంతోపాటు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ https://airtel.apollo247.com/ అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్ టెల్. మీ వయసు, లక్షణాలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి మీ రిస్క్‌ స్థాయిని చెబుతోంది. మీ రిస్క్‌స్థాయిని బట్టి సమీపంలోని ఆస్పత్రిని సందర్శించడానికి ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి.