రోమ్: మొబైల్ ఫోన్‌ దిగ్గజాలు యాపిల్, శామ్‌సంగ్‌ యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా విధాన నిర్ణయాలు తీసుకుంటూ వినియోగదారులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని ఇటలీ మండి పడింది. తమ సంస్థలు తయారు చేసిన కొత్త ఫోన్లను కొనుగోలు చేసే స్థితికి వినియోగదారులను తీసుకొస్తున్నాయని ఇటలీ కాంపిటీషన్ అథారిటీ పేర్కొంది. ప్రణాళిక ప్రకారం వినియోగదారుల వద్ద గల ఫోన్లు పని చేయకుండా వ్యవహరిస్తున్నందుకు యాపిల్ పైన 10 మిలియన్ల యూరోలు, శామ్‌సంగ్‌పై ఐదు మిలియన్ల యూరోల జరిమానా విధించింది. 

యాపిల్, శామ్ సంగ్ వంటి మొబైల్ ఫోన్ దిగ్గజ సంస్థల మీద ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటి సారని తెలుస్తోంది. ఈ రెండు సంస్థల మీద విచారణ చేపట్టిన యాంటీ ట్రస్ట్ అథారిటీ ఏజీసీఎం చేసిన ప్రకటన ప్రకారం.. యాపిల్, సామ్‌సంగ్ అనుచితమైన వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నాయని తెలిపింది. 

‘ప్రస్తుతం వాడుడున్న ఫోన్లు అప్‌డేట్స్‌కు అనుకూలంగా లేకపోయినా, వినియోగదారులను అప్‌డేట్‌ చేసుకొనేలా ప్రేరేపిస్తున్నాయి. దాంతో ఫోన్‌ పనితీరు నెమ్మదిస్తుంది. వాటి గురించి కంపెనీ వినియోగదారులకు సరైన సమాచారం అందించదు. అలాగే ఫోన్‌ పనితీరును ఎలా తిరిగి సాధారణ స్థితికి తెచ్చుకోవాలో కూడా ముందుగా తెలియజేయదు. దాంతో వినియోగదారులు కొత్త ఫోన్లవైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి’ అని ఏజీసీఎం తెలిపింది.

శామ్‌సంగ్ - 2014లో విడుదలైన నోట్ 4లో కొత్తగా విడుదలైన నోట్ 7 కోసం ఉద్దేశించిన గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోమని వినియోగదారులను పదేపదే సూచించింది. కానీ ‘దీని గురించి వినియోగదారులకు ముందుగా తెలియజేయకపోవడంతో కొత్త ఫర్మ్‌వేర్‌ వల్ల డివైస్‌ పనితీరు మందగించి హార్డ్‌వేర్పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అంతేకాదు వారంటీ పూర్తయితే ఈ రిపైర్లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది’ అని తన పరిశీలనలను ఏసీజీఎం బయటపెట్టింది. 

యాపిల్ కూడా ఐఫోన్‌ 7 కోసం డిజైన్ చేసిన యాప్‌లను ఐఫోన్‌ 6లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని సూచించిందన్నారు. అలాగే యాపిల్ ఫోన్‌ బ్యాటరీల వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదని తెలిపింది. కొంతకాలం తర్వాత బ్యాటరీల సామర్థ్యం తగ్గిపోతుందని ఫోన్ల పనితీరు నెమ్మదించేలా చేశామని యాపిల్ కంపెనీ గతంలో అంగీకరించింది. 

ఆ రెండు సంస్థలు అనుసరించిన విధానాలను బట్టి యాపిల్‌కు 10 మిలియన్‌ యూరోలు, శామ్‌సంగ్‌కు 5 మిలియన్‌ యూరోలు జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్‌లో ఇలాంటి దర్యాప్తు మొదలు పెట్టిన సమయంలోనే ఇటలీలో కూడా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జనవరిలో ఇటలీ విచారణ ప్రారంభించింది.